సలామ్‌.. జోన్స్‌ !

0
231
Spread the love

మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాది టెన్నిస్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు తెరలేవనుంది.

టోర్నీ డ్రాలను కూడా విడుదలజేశారు. సాధారణంగా గ్రాండ్‌స్లామ్‌ డ్రాల ప్రకటన సందర్భంగా టాప్‌ స్టార్లపైనే మీడియా దృష్టంతా ఉంటుంది. అలాంటిది ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రాల సమయంలో ఓ అనామక క్రీడాకారిణి గురించి తెలుసుకొనేందుకు అంతర్జాతీయ మీడియా పరుగులు పెట్టింది. ఆమే..బ్రిటన్‌కు చెందిన 20 ఏళ్ల ఫ్రాన్సెస్కా జోన్స్‌. ఇంతకీ ఆమె స్పెషాలిటీ ఏమిటనేగా మీ ప్రశ్న. ఫ్రాన్సెస్కా గురించి తెలుసుకుంటే ‘వావ్‌..సూపర్‌’ అనక మానరు. ఇంకా..ఆమె పట్టుదలకు ‘సలామ్‌’ అంటారు. చివరగా..దివ్యాంగులకు స్ఫూర్తి ప్రదాతగా ఆమెను ప్రశంసిస్తారు. జోన్స్‌ ‘ఎకో్ట్రడాక్టిలీ ఎక్టోడెర్మల్‌ డిస్‌ప్లాసియా సిండ్రోమ్‌’ (ఈఈఎస్‌) అనే అరుదైన జన్యుపర సమస్యతో జన్మించింది. ఈ సమస్యవల్ల చేతులు, పాదాలు అభివృద్ధికావు. దాంతో ఫ్రాన్సెస్కాకు ఒక్కో చేతికి బొటన వేలితోపాటు మరో మూడు వేళ్లు, ఎడమ కాలికి నాలుగు, కుడి కాలికి మూడు వేళ్లే ఉన్నాయి. ఇందుకు ఆమె బాధపడుతూ కూర్చోలేదు. అసలు దానిని సమస్యగానే జోన్స్‌ అనుకోలేదు. అది కేవలం వీక్‌నెస్‌గానే భావించింది.

డాక్టర్లేమో..

జోన్స్‌కున్న సమస్య రీత్యా ఆమె టెన్నిస్‌ ఆడలేదని తేల్చేశారు. కానీ పట్టువదలని ఫ్రాన్సెస్కా ఒకటి రెండు కాదు ఏకంగా 10 సర్జరీలు చేయించుకొని ఉన్న వేళ్లను టెన్నిస్‌ ఆడేందుకు అనుగుణంగా మార్చుకుంది. జిమ్‌లలో తీవ్రంగా శ్రమించి శారీరక సామర్థ్యాన్ని బాగా పెంచుకొంది. ఆమె చేతివేళ్లకు గ్రిప్‌ చిక్కేలా ప్రత్యేక రాకెట్‌ వాడుతుంది. బార్సిలోనాలోని ‘సాంచెజ్‌ క్యాజిల్‌ అకాడమీలో శిక్షణ పొందింది. బ్రిటన్‌కే చెందిన మూడు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్‌ ఆండీ మర్రే కూడా అదే అకాడమీలో తన నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం విశేషం. అలా తనకిష్టమైన టెన్నిస్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన జోన్స్‌..ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు క్వాలిఫై కావడం ద్వారా గ్రాండ్‌స్లామ్‌ ఆడాలన్న తన కలను నిజం చేసుకుంది. దుబాయ్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఫ్రాన్సెస్కా అదరగొట్టింది. ఈక్రమంలో ప్రపంచ మాజీ 11వ ర్యాంకర్‌ మోనికా నికులెస్క్యూకు జోన్స్‌ షాకిచ్చింది.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రా అర్హత పొందానన్న విషయం తెలిసిన మరుక్షణం ఈ బ్రిటన్‌ అమ్మాయి ఆనందం పట్టలేక ఏడ్చేసింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 241వ స్థానంలో ఉన్న ఫ్రాన్సెస్కా బుధవారం ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)తో తలపడనుంది. ‘పరిమితులు ఏర్పర్చుకోకుండా సాగిపోండి. మీరు ఏం చేయాలనుకున్నారో దానిని నిబద్ధతగా చేయండి. నా నుంచి పిల్లలు, పెద్దలు స్ఫూర్తి పొందితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’ అని నిండైన ఆత్మవిశ్వాసంతో జోన్స్‌ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here