గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్‌షోతో సత్తా చాటింది. తొలిసారిగా బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు బౌలర్లు కూడా రాణించడంతో ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టీ20లో భారత్ 8 పరుగులతో నెగ్గింది. దీంతో ఐదు టీ20ల సిరీ్‌సను 2-2తో సమం చేసింది. చివరి మ్యాచ్ శనివారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. శ్రేయాస్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37), పంత్ (30) రాణించారు. ఆర్చర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసి ఓడింది. స్టోక్స్ (46), రాయ్ (40) పోరాడారు. శార్దూల్‌కు మూడు.. పాండ్యా, చాహర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.

ఒత్తిడిలో చిత్తు: ఛేదనలో రాయ్, స్టోక్స్ మినహా మరే బ్యాట్స్‌మెన్ వేగం కనబర్చలేదు. కీలక సమయంలో చాహర్, శార్దూల్ వికెట్లు తీసి జట్టును దెబ్బతీశారు. ఓపెనర్ బట్లర్ (9) ఈసారి విఫలమైనా మరో ఓపెనర్ రాయ్ జట్టుకు అండగా నిలిచాడు. ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టాడు. మలాన్ (14) మాత్రం చాహర్ గూగ్లీని రివర్స్ స్వీప్ ఆడబోయి బౌల్డయ్యాడు. అటు ఊపు మీదున్న రాయ్ కూడా పాండ్యా ఓవర్‌లో సూర్యకు క్యాచ్ ఇవ్వడంతో కష్టాల్లో పడింది. కానీ మధ్య ఓవర్లలో స్టోక్స్-బెయిర్‌స్టో జోడీ వీరవిహారంతో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగింది. వీరి ధాటికి సుందర్ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. 14వ ఓవర్‌లో బెయిర్‌స్టో వరుసగా 4,6,4 బాదేశాడు. కానీ మరుసటి ఓవర్‌లోనే అతడిని చాహర్ అవుట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా చివరి 5 ఓవర్లలో 54 పరుగులు.. క్రీజులో స్టోక్స్ ఉండడంతో భారత్‌లో ఆందోళన కనిపించింది. దీనికి తెరదించుతూ 17వ ఓవర్‌లో బెన్, మోర్గాన్ (4)లను శార్దూల్ అవుట్ చేశాడు. ఆఖర్లో జోర్డాన్ (12), ఆర్చర్ (18 నాటౌట్) కాస్త ఆశలు రేపినా ఫలితం లేకపోయింది.
బెదరని సూర్య: తొలి ఓవర్ మొదటి బంతినే సిక్సర్.. మూడో బంతిని ఫోర్‌గా మలిచిన రోహిత్ (12) జోరు మీదున్నట్టు కనిపించాడు. కానీ అతడిని నాలుగో ఓవర్‌లోనే రిటర్న్ క్యాచ్‌తో ఆర్చర్ అవుట్ చేశాడు. ఆ వెంటనే బరిలోకి దిగిన సూర్యకుమార్ వహ్వా అనిపించే రీతిలో ఆడాడు. తనకిది రెండో మ్యాచ్ అయినా బ్యాట్ పట్టింది మాత్రం తొలిసారే.. కానీ ఎలాంటి బెరుకూ కనిపించలేదు. ఆర్చర్ ఓ బౌన్సర్‌తో అతడికి స్వాగతం పలగ్గా దాన్ని నటరాజ భంగిమలో హుక్ షాట్‌తో సిక్సర్‌గా మార్చాడు. రషీద్ ఓవర్‌లోనూ వరుసగా 4,6తో సత్తా చాటాడు. అయితే ఈ దశలో వరుస ఓవర్లలో జట్టు రాహుల్ (14), కోహ్లీ (1) వికెట్లను కోల్పోయింది. కానీ సూర్య దూకుడు మాత్రం తగ్గలేదు. రషీద్ లక్ష్యంగా స్వీప్ షాట్లతో బౌండరీలు బాదేసి 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 14వ ఓవర్‌లో మోకాలిపై కూర్చుని ఫైన్ లెగ్ వైపు అద్భుత సిక్సర్ బాదాడు. మరుసటి బంతినీ అదే తరహాలో ఆడి వివాదాస్పద రీతిలో క్యాచ్ అవుటయ్యాడు. శ్రేయాస్ మాత్రం వచ్చీ రావడంతోనే ఫోర్లతో సమాధానమిచ్చాడు. పంత్ (30)తో కలిసి ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. 17వ ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో పంత్ బౌల్డ్ అయ్యాడు. జోర్డాన్ ఓవర్‌లో అయ్యర్ 6,4,6తో 18 పరుగులు రాబట్టి రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. చివరి 12 బంతుల్లో పాండ్యా (11), శ్రేయాస్, సుందర్ (4) వికెట్లను భారత్ కోల్పోవడంతో స్కోరు 190లోపే పరిమితమైంది.
బ్యాడ్‌లక్ సూర్య
ఏ బౌలర్‌నూ వదలకుండా చెలరేగిన సూర్యకుమార్ ఇన్నింగ్స్ వివాదాస్పదంగా ముగిసింది. 14వ ఓవర్‌ను సామ్ కర్రాన్ వేయగా తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని షాట్‌కొట్టగా మలాన్ ఫైన్ లెగ్‌లో ముందుకు వంగి క్యాచ్ అందుకున్నాడు. అయితే రీప్లేలో అతడు బంతిని నేలకు తాకించినట్టు స్పష్టంగా కనిపించింది. కానీ మూడో అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడి సూర్యను అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో కోహ్లీ ఆగ్రహించాడు. ఇదే తరహాలో సుందర్ క్యాచ్‌లోనూ రషీద్ కాలు బౌండరీ లైన్‌కు తాకినట్టు అనిపించినా మూడో అంపైర్ అవుటిచ్చాడు.
స్కోరు బోర్డు
భారత్: రోహిత్ (సి అండ్ బి) ఆర్చర్ 12; రాహుల్ (సి) ఆర్చర్ (బి) స్టోక్స్ 14; సూర్యకుమార్ (సి) మలాన్ (బి) సామ్ కర్రాన్ 57; కోహ్లీ (స్టంప్) బట్లర్ (బి) రషీద్ 1; పంత్ (బి) ఆర్చర్ 30; శ్రేయాస్ (సి) మలాన్ (బి) ఆర్చర్ 37; పాండ్యా (సి) స్టోక్స్ (బి) వుడ్ 11; శార్దూల్ (నాటౌట్) 10; సుందర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 4; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 185/8. వికెట్ల పతనం: 1-21, 2-63, 3-70, 4-110, 5-144, 6-170, 7-174, 8-179. బౌలింగ్: రషీద్ 4-1-39-1; ఆర్చర్ 4-0-33-4; వుడ్ 4-1-25-1; జోర్డాన్ 4-0-41-0; స్టోక్స్ 3-0-26-1; సామ్ కర్రాన్ 1-0-16-1.
ఇంగ్లండ్: రాయ్ (సి) సూర్య (బి) పాండ్యా 40; బట్లర్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 9; మలాన్ (బి) చాహర్ 14; బెయిర్‌స్టో (సి) సుందర్ (బి) చాహర్ 25; స్టోక్స్ (సి) సూర్యకుమార్ (బి) శార్దూల్ 46; మోర్గాన్ (సి) సుందర్ (బి) శార్దూల్ 4; సామ్ కర్రాన్ (బి) పాండ్యా 3; జోర్డాన్ (సి) పాండ్యా (బి) శార్దూల్ 12; ఆర్చర్ (నాటౌట్) 18; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 177/8. వికెట్ల పతనం: 1-15, 2-60, 3-66, 4-131, 5-140, 6-140, 7-153, 8-177. బౌలింగ్: భువనేశ్వర్ 4-1-30-1; పాండ్యా 4-0-16-2; శార్దూల్ 4-0-42-3; సుందర్ 4-0-52-0; రాహుల్ చాహర్ 4-0-35-2.