కరోనా వైరస్ కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు.. కఠిన క్వారంటైన్ కష్టాలను అధిగమించిన ఆటగాళ్లు.. తమ ఆటతో కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు. సోమవారం ఆరంభమయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రధానంగా అమెరికా టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్, ప్రపంచ నెంబర్‌వన్ జొకోవిచ్, నెంబర్ టు నడాల్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. ఓపెన్ ఎరాలో మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా 24 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన మార్గరెట్ కోర్ట్ రికార్డు సమం కోసం విశ్వప్రయత్నం చేస్తున్న సెరెనా.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాలనుకుంటోంది. మరోవైపు డిఫెండింగ్ చాంప్ జొకోవిచ్ హ్యాట్రిక్ టైటిల్‌పై గురిపెట్టాడు. ఈసారి విజేతగా నిలిస్తే, ఇక్కడ 9 టైటిళ్లు నెగ్గిన ఏకైక ఆటగాడిగా అతడు రికార్డుకెక్కుతాడు. ఇక.. నడాల్ గెలిస్తే 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలవనున్నాడు.

భారత ఐదో మహిళగా..:
గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన భారత ఐదో క్రీడాకారిణిగా అంకిత రైనా రికార్డులకెక్కింది. మహిళల డబుల్స్‌లో మిమేలా బుజర్‌నెస్క్యూ (రొమేనియా)తో కలసి అంకిత ఆడనుంది. పురుషుల డబుల్స్‌లో బోపన్న, దివిజ్ తమ భాగస్వాములతో కలిసి బరిలోకి దిగనుండగా.. సింగిల్స్‌లో సుమిత్ నగాల్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆటగాడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.