ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో మనోళ్లు పసిడి పంట పండిస్తున్నారు. వరుసగా ఏడోరోజూ భారత్ ఖాతాలో పసిడి పతకం చేర్చారు. గురువారం జరిగిన పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మనూ భాకర్, రాహీ సర్నోబాత్, చింకీ యాదవ్‌లతో కూడిన భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మనూ బృందం 17-7 స్కోరుతో పోలెండ్‌కు చెందిన జొహన్నా, జులిటా, ఆగ్నెస్కాలతో కూడి న జట్టును చిత్తుచేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం లభించింది. ఫైనల్లో అంజుమ్ మోద్గిల్, శ్రేయా సక్సేనా, గాయత్రి నిత్యానందంతో కూడిన భారత జట్టు 43-47తో పోలెండ్ చేతిలో ఓడింది. ఇండోనేసియా జట్టుకు కాంస్యం దక్కింది. దీంతో టోర్నీలో భారత్ ఇప్పటిదాకా 10 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి 21 పతకాలు సాధించింది.

ఫైనల్ నుంచి వైదొలగిన హంగేరీ జట్టు
ప్రపంచక్‌పలో పురుషుల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌తో పాటు ఫైనల్ చేరిన హంగేరీ జట్టు టైటిల్‌ఫైట్ నుంచి తప్పుకొంది. జట్టులోని ముగ్గురు షూటర్లలో సీనియరైన పీటర్ సిదితో మిగతా ఇద్దరికి రైఫిల్ స్టాండ్ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఆ జట్టు ఫైనల్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. దీంతో మూడోస్థానంలో నిలిచిన అమెరికాతో భారత్ ఫైనల్లో శుక్రవారం తలపడనుంది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఫైనల్ నుంచి అర్ధంతరంగా వైదొలగిన హంగేరీ జట్టుపై అనర్హత వేటు వేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.