చెస్ ర్యాపిడ్ ఫార్మాట్‌లో వరల్డ్ చాంపియన్‌గా కొనసాగుతున్న భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి మరో అరుదైన ఘనత దక్కింది. 2020 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక బీబీసీ ఉత్తమ భారత క్రీడాకారిణిగా ఎంపికైంది. 15 ఏళ్లకే చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించిన ఈ తెలుగు తేజానికి అభిమానుల నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి. సోమవారం మహిళా దినోత్సవాన వర్చువల్‌గా జరిగిన సమావేశంలో హంపికి ఈ అవార్డును అందించారు. 40 మందితో కూడిన జ్యూరీ హంపితో పాటు రెజ్లర్ వినేశ్ ఫొగట్, స్ర్పింటర్ ద్యూతీ చంద్, షూటర్ మనూ భాకర్, హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్‌లను గతంలోనే నామినేట్ చేసింది. ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ను నిర్వహించగా అభిమానుల మొగ్గు హంపి వైపే ఉన్నట్టు తేలింది. మరోవైపు బీబీసీ జీవిత సాఫల్య అవార్డును మాజీ లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జికి అందించగా.. ఎమర్జింగ్ ప్లేయర్‌గా మనూ భాకర్ నిలిచింది.

ఈ అవార్డు చాలా విలువైనది
‘బీబీసీ అవార్డు నాకే కాకుండా మొత్తం చెస్ ప్రపంచానికే అత్యంత విలువైనది. ఇండోర్ గేమ్ కావడంతో భారత్‌లో క్రికెట్‌కు లభిస్తున్న ఆదరణ చెస్‌కు లేదు. ఈ అవార్డుతోనైనా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుందని భావిస్తున్నా. నా విల్ పవర్, ఆత్మవిశ్వాసంతోనే కొన్నేళ్లుగా విజయాలు సాధిస్తున్నా. మహిళకు వివాహం, అమ్మతనం జీవితంలో భాగమే కానీ.. దానికోసం కెరీర్‌ను వదులుకోకూడదు’