చెన్నై: కరోనా కాలంలోనూ ఐపీఎల్ క్రికెటర్లపై కనకవర్షం ఆగలేదు. ఈ ఏడాది జరిగే 14వ సీజన్ కోసం గత రికార్డులను తిరగరాస్తూ ఆయా జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. గురువారం జరిగిన ఈ క్రికెటర్ల మినీ వేలంలో ఎక్కువగా విదేశీ ఆటగాళ్లే లబ్దిపొందారు. భారత్‌కు చెందిన ఏ ఆటగాడూ రూ.10 కోట్లు దాటలేకపోయాడు. ఏప్రిల్‌లో జరిగే ఈ లీగ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు ఇదివరకే ఎనిమిది జట్లు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదులుకున్నాయి. మరికొందరు వేలంపై ఆసక్తితో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇలా తుది జాబితాలో నిలిచిన 292 మంది ఆటగాళ్ల కోసం చెన్నైలో ఈ వేలం జరిగింది. మొత్తంగా 57 మంది క్రికెటర్లు అమ్ముడుపోగా అన్ని జట్లు కలిపి రూ.145 కోట్ల 30 లక్షలు ఖర్చు చేశాయి.

మ్యాక్సీపై ప్రేమ
వేలం ఆరంభంలో మొదట ముగ్గురు అన్‌సోల్డ్‌గా మిగలగా.. స్మిత్‌ను ఢిల్లీ జట్టు రూ.2.20 కోట్లకు తీసుకోవడంతో వేలంలో కదలిక వచ్చింది. ఇక మ్యాక్స్‌వెల్‌పై ఎప్పటిలాగానే ఫ్రాంచైజీలు తమ ఆసక్తిని కనబరచాయి. గతేడాది లీగ్‌లో 13 మ్యాచ్‌ల్లో 108 పరుగులే చేసినా.. అతడి వంతు రాగానే పోటీ ఎక్కువైంది. దీంతో బెంగళూరు రూ.14.25 కోట్లకు మ్యాక్సీని సొంతం చేసుకుంది. అలాగే మొయిన్ అలీకి కూడా మంచి ధర పలికింది. చెన్నై అతన్ని రూ. 7 కోట్లకు తీసుకుంది. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో నెంబర్‌వన్‌గా ఉన్న డేవిడ్ మలాన్‌పై పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు. దీంతో పంజాబ్ అతడిని రూ.1.50 కోట్లకే తీసుకుంది.
రూ.75 లక్షల నుంచి రూ.16.25 కోట్లకు..
అదృష్టమంటే మోరి్‌సదే.. 2019 నుంచి అసలు అంతర్జాతీయ క్రికెట్టే ఆడని ఈ 33 ఏళ్ల ఆల్‌రౌండర్ ఈసారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. గతంలో రూ.10 కోట్లు వెచ్చించిన బెంగళూరు ఈసారి అతడిని వదిలేసి.. తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంది. దీంతో తను రూ.75లక్షల కనీస ధరతో వేలంలో అందుబాటులోకి వచ్చాడు. అయితే లోయర్ ఆర్డర్‌లో భారీ హిట్టింగ్ చేయగల మోరి్‌సపై అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లు వెచ్చించింది. ముందుగా అతడి కోసం ముంబై, ఆర్‌సీబీ పోటీ పడ్డాయి. రేటు రూ.10 కోట్లు చేరేసరికి బెంగళూరు వెనక్కి తగ్గింది. దీంతో రాజస్థాన్ పోటీలోకొచ్చింది. ఆ తర్వాత పంజాబ్ కూడా అతడి కోసం ప్రయత్నించగా చివరకు రాజస్థాన్ విజేతగా నిలిచింది. గతంలోనూ మోరి్‌సకు ఆర్‌ఆర్‌తో ఆడిన అనుభవముంది. ఈ క్రమంలో అతడు యువరాజ్ అత్యధిక రేటు రూ.16 కోట్ల (2015లో ఢిల్లీ) రికార్డును కూడా అధిగమించాడు.
స్టార్లు కాకపోయినా..
ఈసారి కూడా పెద్దగా పేరులేని ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు పోటీపడి వారిని కోటీశ్వరులుగా మార్చాయి. ముఖ్యంగా కివీస్ ఆల్‌రౌండర్ కైల్ జేమిసన్‌ను ఆర్‌సీబీ రూ.15 కోట్లకు కొనుగోలు చేయడం ఆశ్చర్యపరిచింది. గతేడాది భారత జట్టు కివీస్ పర్యటనలోనే అతడు వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసి అదరగొట్టాడు. దాదాపు ఏడడుగుల ఎత్తు కలిగిన జేమిసన్ టెయిలెండ్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి మూడు ఫార్మాట్లలో కలిపి కేవలం 12 మ్యాచ్‌ల అనుభవమే ఉంది. ఇదే తరహాలో జే రిచర్డ్‌సన్‌ను పంజాబ్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక బిగ్‌బాష్ స్టార్ రిలే మెరెడిత్‌పై పంజాబ్ రూ.8.00 కోట్లు కుమ్మరించడం మరింత షాక్‌కు గురి చేసింది. రూ.40 లక్షల కనీస ధర కలిగిన అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. హోబర్ట్ హరికేన్ తరఫున ఆడే రిలే బిగ్‌బా్‌షలో 34 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీశాడు.
విహారికి నిరాశ
తెలుగు క్రికెటర్ హనుమ విహారికి నిరాశే ఎదురైంది. మరో ఇద్దరు ఆంధ్ర క్రికెటర్లు కేఎస్ భరత్ (రూ.20 లక్షలు)ను ఆర్‌సీబీ, హరిశంకర్ రెడ్డి (రూ.20లక్షలు)ని సీఎ్‌సకే తీసుకుంది. శివమ్ దూబేను రూ.4.4 కోట్లకు రాజస్థాన్, చివర్లో హర్భజన్‌ను కేకేఆర్ రూ.2 కోట్లకు, కరుణ్ నాయర్‌ను రూ.50 లక్షలకు కోల్‌కతా కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చటేశ్వర్ పుజార కనిపించబోతున్నాడు. అతడిని ధోనీ సేన కనీస ధర 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఊహించినట్టుగానే సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. వేలంలో చిట్టచివరి ఆటగాడిగా అతడి పేరును ప్రకటించగా ఏ జట్టు కూడా పోటీలోకి రాలేదు. దీంతో అతడి కనీస ధర రూ.20 లక్షలకే ముంబై తీసుకుంది. ఈసారి వేలంలో అందరికంటే తక్కువగా సన్‌రైజర్స్ ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తీసుకుంది. ఇందులో కేదార్ జాదవ్ (రూ.2 కోట్లు), స్పిన్నర్ ముజీబుర్ రహ్మాన్ (రూ.1.50 కోట్లు), జగదీశ్ సుచిత్ (రూ.30 లక్షలు) ఉన్నారు.
అ‘ధర’గొట్టిన క్రికెటర్లు..
ఆటగాడు జట్టు ధర
క్రిస్ మోరిస్ రాజస్థాన్ రూ.16.25 కోట్లు
కైల్ జేమిసన్ బెంగళూరు రూ.15 కోట్లు
మ్యాక్స్‌వెల్ బెంగళూరు రూ.14.25 కోట్లు
జే రిచర్డ్‌సన్ పంజాబ్ రూ.14 కోట్లు
కె.గౌతమ్ చెన్నై రూ.9.25 కోట్లు
రిలే మెరెడిత్ పంజాబ్ రూ.8 కోట్లు
మొయిన్ అలీ చెన్నై రూ.7 కోట్లు
షారుక్ ఖాన్ పంజాబ్ రూ.5.25 కోట్లు
టామ్ కర్రాన్ ముంబై రూ.5.25 కోట్లు