తంబళ్లపల్లె మండలం ఏటిగడ్డ తాండాకు చెందిన తల్లి, కూతురు, ముగ్గురు పిల్లలు అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు పిల్లల తల్లి సరళ(35), ఈమె తల్లి గంగులమ్మ(65) దారుణ హత్యకు గురయ్యారని దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది.

అదే గ్రామానికి చెందిన మౌలాలిని నిందితుడిగా గుర్తించారు. తానే వారిద్దరినీ హతమార్చి, సరళ కుమార్తెలు శ్రావణి(15), శశికళ(10), శ్యాము(06)ను కర్ణాటకలోని గౌనిపల్లెలో నిర్బంధించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పిల్లలను విడిపించారు. కేసు విచారణలో భాగంగా మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఆదివారం తంబళ్లపల్లెకు వచ్చారు. మౌలాలి తమను బెదిరించి కర్ణాటకలోని గౌనిపల్లెలో నిర్భంధించాడని డీఎస్పీకి పిల్లలు తెలిపారు. తమ తల్లి, అవ్వ ఎక్కడున్నారంటూ పిల్లలు ప్రశ్నించడంతో వారి దీన పరిస్థితిని చూసి ఏటిగడ్డ తాండా మహిళలు బోరున విలపించారు.