హైదరాబాద్/నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఓ వివాహిత కిడ్నాప్ సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన అజ్జూ, అతని భార్య ముస్రత్ తన ఏడాది కుమారుడితో కలిసి ఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటోంది. శనివారం తన బాబుతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన ముస్రత్ మధ్యాహ్నమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అజ్జూ, అతని సోదరి ఫోన్ చేశారు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, వాహనంలో తీసుకెళ్తున్నారని ముస్రత్ చెప్పడంతో వెంటనే అజ్జూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన సీఐ లింగేశ్వర్‌రావు, ఎస్‌ఐ గంగరాజు.. సెల్ సిగ్నల్ ఆధారంగా.. టవర్ లొకేషన్ వివరాలు సేకరించారు. ఆమె హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారమివ్వడంతో.. వారు ముస్రత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. కుటుంబ గొడవలతోనే ఇంట్లోంచి వెళ్లిపోయానని ఆమె పోలీసుల విచారణలో చెప్పింది. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించామని, ముస్రత్‌ను వారికి అప్పగించామని ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.