ప్రేమికులిద్దరికి వేరే వారితో పెళ్లిళ్లు జరిగినా.. ప్రేమను చంపుకోలేక..

0
186
Spread the love

నెల్లూరు: ఒకే సచివాలయంలో వారిద్దరూ సహుద్యోగులు. విధినిర్వాహణలో కలిసిమెలిసి పనిచేసే వారి మనుసులు కలిశాయి.

‘నువ్వులేక నేనుండలేను’ అనంతస్థాయిలో ప్రేమలో పడ్డారు. అయితే, ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమ వ్యవహారం పెద్దలకు చెప్పే ధైర్యం చాలలేదు. ఈలోపే కుటుంబ పెద్దలు వారికి పెళ్లిళ్లు చేసేశారు. మరొకరితో దాంపత్య జీవితం గడపలేక, తమ ప్రేమను చంపుకోలేని ఆ ఇద్దరు ఉరితాడుకు బలి అయ్యారు. నెల్లూరులోని ఓ లాడ్జిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగు చూడటంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.దగదర్తి మండలానికి చెందిన ఈగ సుబ్రహ్మణ్యం, అరుణమ్మ దంపతులు నాయుడుపేటలో ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె లావణ్య (26) ఇంజనీరింగ్‌ పూర్తి చేసి చిట్టమూరు మండలం మెట్టు సచివాలయంలో 2019లో వీఆర్వోగా పని చేస్తోంది. ఇందుకూరుపేట మండలం జేజేపేటకు చెందిన గురవయ్య, వెంకటరమణమ్మల చిన్నకుమారుడు హరీష్‌ (30) ఇంజనీరింగ్‌ పూర్తి చేసి గతేడాది జనవరిలో మెట్టు సచివాలయంలోనే అసిస్టెంట్‌ ఇంజనీరుగా చేరాడు. ఒకేచోట లావణ్య, హరీష్‌లు పని చేస్తుండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. తమ ప్రేమవ్యవహారం పెద్దలకు చెప్పేందుకు కులాలు అడ్డు వచ్చాయి. ఇద్దరు కుటుంబసభ్యులు ఆ ప్రేమికులిద్దరికి వేరే వారితో వివాహాలు నిశ్చయించారు. సైదాపురం సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దగదర్తి వాసితో డిసెంబరు 11న లావణ్యకు, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మాచవరానికి చెందిన యువతితో డిసెంబరు 19న హరీ్‌షకు పెళ్లి జరిగింది.

మరొకరితో కాపురం చేయలేక..

పెళ్లిళ్లు జరిగినా ప్రేమను చంపుకోలేక, మరొకరితో కాపురం చేయలేక నెల రోజులుగా ఆ ప్రేమికులు మానసిక క్షోభను అనుభవించారు. అటు సమాజాన్ని ఎదురించలేక, ఇటు వివాహం చేసుకున్న వారితో ఉంటూ ప్రేమను చంపుకోలేక చావుతోనైనా ఇద్దరం ఒక్కటవుదామని నిశ్చయించుకున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరులోని సుందరయ్య కాలనీ శివారు ప్రాంతంలో ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. హరీష్‌, లావణ్యలు గదికి చేరుకుని తమ తల్లిదండ్రులకు ఓ ఉత్తరం రాశారు. ‘‘దయచేసి మమ్మల్ని క్షమించండి ఇలా చేస్తున్నందుకు.. మా అవయవాలు దానం చేయండి.’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత తమతోపాటు తెచ్చుకున్న ఓ చున్నీతో స్లాబ్‌కు ఉన్న హూక్‌కు తగిలించారు. మరో చున్నీని తమ అరుపులు బయటకు రాకుండా ఇద్దరి నోటికి కట్టుకున్నారు. మొదట సిద్ధం చేసుకుని చున్నీని ఇరువైపులా తమ మెడలకు బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.శుక్రవారం రాత్రి లాడ్జిలో పని చేసే రూమ్‌బాయ్‌ గదిని శుభ్రపరిచేందుకు తలుపులు తట్టగా ఎవరూ స్పందించక పోవడంతో అనుమానంతో ఆ గది వెనుక ఉన్న కిటికీ తలుపును బలవంతంగా తెరిచి చూడగా ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో రూమ్‌బాయ్‌ లాడ్జి యజమానులకు సమాచారం అందించడంతో యాజమాన్యం బుకింగ్‌ రికార్డుల్లో ఉన్న మరో నెంబరుకు ఫోన్‌ చేసి మృతిరాలి తండ్రి సుబ్రహ్మణ్యంకు సమాచారం అందజేశారు. దీంతో శనివారం ఉదయం మృతురాలి తండ్రి లాడ్జి వద్దకు చేరుకొని వేదాయపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, ఎస్‌ఐ పుల్లారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని గది తలువులు పగలగొట్టి మృతదేహాలను కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here