పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ప్రాణహాని ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు న్యాయవాది దంపతులు తెలిపారు. అయితే వామనరావు హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో శీలం రంగయ్య లాకప్ డెత్‌పై హైకోర్టులో వామనరావు, నాగమణి పిటిషన్ వేశారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను విచారణ అధికారిగా హైకోర్టు నియమించింది. కేసు వాపస్ తీసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు వామనరావును బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామగుండం సీపీ సత్యనారాయణతో వామనరావు, నాగమణి వాగ్వాదానికి దిగారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకి వ్యతిరేకంగా వామనరావు పలు కేసులు వాదిస్తున్నారు. న్యాయవాదుల హత్యపై తెలంగాణ బార్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

వామనరావు, నాగమణిని దుండగులు నరికిచంపిన విషయం తెలిసిందే. కారులోనే విచక్షణారహితంగా కత్తులతో దుండగులు నరికిచంపారు. రామగిరి మండలం కలవచర్ల వద్ద ఈ ఘటన జరిగింది. న్యాయవాది దంపతుల స్వగ్రామం మంథని మండలం గుంజపడుగు. స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దంపతులు హత్యకు గురైనారు. దాడి నుంచి తప్పించుకున్న వామనరావు కారు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే చనిపోతూ వామనరావు దుండగుడి పేరు చెప్పారు. కుంట శ్రీను తనపై దాడి చేశాడంటూ చనిపోయే ముందు వామనరావు చెప్పారు. చావుబతుకుల మధ్య స్థానికులకు ఆయన దాడి ఘటనను వెల్లడించారు. కుంట శ్రీను మంథని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కావడం గమనార్హం. ఆరు బృందాలతో కేసు విచారణను పోలీసులు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సత్యనారాయణ ప్రకటించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను ఎవరైనా వదిలేది లేదని సత్యనారాయణ స్పష్టం చేశారు.