యువకులకు చెడు అలవాట్లు నేర్పి పాడుచేయవద్దని చెప్పిన బస్తీ పెద్దల ఇళ్లపై ఓ రౌడీషీటర్ కత్తులతో దాడి చేశాడు. అనుచరులతో వచ్చి ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఇళ్ల తలుపులను ధ్వంసం చేశాడు. ఈ విషయంపై మీడియాకు సమాచారం ఇచ్చిన ఓ వ్యక్తి అన్నయ్యపై కూడా దాడి చేశాడు. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ కె.కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ వాది ఎ మహమూద్ ప్రాంతానికి చెందిన ఖోని గౌస్ (35) పాత నేరస్థుడు. ఇతనిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉంది. గౌస్ స్థానిక యువకులకు చెడు అలవాట్లు నేర్పిస్తున్నాడు. గమనించిన బస్తీ పెద్దలు అలా చేయవద్దని చెప్పారు.

దీంతో ఆగ్రహం చెందిన గౌస్ మద్యం, గంజాయి తాగి తన అనుచరులతో కలిసి గురువారం అర్ధరాత్రి బస్తీలో కరెంటు కట్ చేశాడు. తనకు మంచి మాటలు చెప్పిన వారి ఇళ్లపై తల్వార్‌లతో, కత్తులతో దాడి చేశాడు. కనిపించిన ఆటోలను, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశాడు. స్థానికులందరూ ఒకేసారి బయటకు వచ్చి అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని బస్తీకి చెందిన మోహిన్ మీడియాకు సమాచారం ఇచ్చాడు. అతడిపై కక్షకట్టిన గౌస్ బస్తీకి చేరుకుని మోహిన్ సోదరుడు నవాజ్ ఖురేషీ కళ్లల్లో కారం పొడి చల్లి దాడి చేశాడు.