కథ:
గౌతమ(సుమంత్) హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్. పోలీస్‌గా ఏదో సాధించాలనుకునే గౌతమ్‌కి ట్రాఫిక్ నుంచి క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో వెళ్లాలనే ఆసక్తి ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా మెట్రో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో మూడు అస్థి పంజరాలు బయటపడతాయి. మూడు అస్థి పంజరాల్లో ఓ పదేళ్ల పాప అస్థి పంజరం కూడా ఉందని తెలియడంతో గౌతమ్‌కి చాలా బాధ వేస్తుంది. అభం శుభం తెలియని ఓ పదేళ్ల పాపను ఎవరు చంపారో తెలుసుకోవాలనుకుంటాడు గౌతమ్. పై అధికారికి ఇష్టం లేకపోయినా క్రైమ్ కేసులో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అయిన తను ఇన్‌వాల్వ్ అవుతాడు. వివరాలను సేకరించడం మొదలుపెడతాడు. 1977లో వరంగల్‌లో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆఫీసర్ రంగరావు కుటుంబానివే ఆ అస్థిపంజరాలని తెలుస్తుంది. అర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన తొంబై లక్షల విలువైన సంపదను రంగారవు తన పార్ట్‌నర్‌తో కలిసి దోచుకుని పారిపోయే క్రమంలో కారు తగలబడిపోయిందని, కనపడకుండా ఫ్యామిలీ కనిపించకుండా పోయిందని పోలీసులు కేసు మూసేసి ఉంటారు. కానీ గౌతమ్‌కి కేసులో ఏదో తిరకాసుందని అర్థమవుతుంది. దాంతో కేసుని డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ రంజిత్(నాజర్)ని కలుస్తాడు. అప్పుడు మరికొన్ని వివరాలు తెలుస్తాయి. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు లాకప్ అనే చిన్న పత్రిక ఎడిటర్ గోపాలకృష్ణ అలియాస్ జీకే(జయప్రకాష్) కూడా తోడవుతాడు. అసలు రంజిత్ కేసు నుంచి అర్థాంతరంగా ఎందుకు వైదొలుగుతాడు? గోపాలకృష్ణకి కేసుకి ఉన్న సంబంధమేంటి? రంగారావు కుటుంబాన్ని ఎవరు చంపారు? అనే విషయాలను గౌతమ్ తెలుసుకున్నాడా? చివరకు హంతకుడెవరు తెలుసుకున్న గౌతమ్ ఏం చేశాడు? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:
నటీనటుల విషయానికి వస్తే హీరో పాత్ర కమర్షియల్ పోలీస్ క్యారెక్టర్ స్టైల్లో లేకుండా నేచురాలిటీకి దగ్గరగా ఉండటంతో సుమంత్ సినిమా చేయడానికి ఓకే అన్నాడు. పాత్రలో పెద్దగా కష్టపడేది లేకపోవడంతో సులభంగానే క్యారీ చేశాడు సుమంత్. నందితా శ్వేత పాత్ర చాలా పరిమితమే అయినా, పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించింది. కుటుంబాన్ని పోగొట్టుకుని బాధపడుతున్న రైటర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా నాజర్, లాకప్ అనే ఓ చిన్న పత్రిక ఎడిటర్‌గా జయప్రకాశ్ అందరూ వారి పాత్రల మేరకు కథలో ఇమిడిపోయారు. ఇక మెయిన్ విలన్‌గా చేసిన కన్నడ నటుడు చక్కగా నటించాడు.
సాంకేతికంగా చూస్తే.. డైరెక్టర్ ప్రదీప్ కృష్ణమూర్తి సినిమాకు పెద్దగా కష్టపడే పనిలేకుండా మాతృకను ఫాలో అయిపోయాడంతే. సైమన్ కింగ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మాంటేజ్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. కన్నడ చిత్రం ‘కావలుధారి’ సినిమా చూసిన వారికి.. తెలుగులో సినిమా చూసినా కన్నడ సినిమా ఫీలింగ్ అనే భావన కలుగుతుందనడంలో సందేహం లేదు. నలబై ఏళ్ల క్రితం క్రైమ్ డిపార్ట్‌మెంట్ వాళ్లు మూసేసిన కేసుని ఓ ట్రాఫిక్ ఎస్సై ఎలా డీల్ చేశాడనేదే సినిమా కథాంశం సింపుల్‌గా చెప్పాలంటే సినిమా అదే. ట్విస్టులు, టర్న్‌లను రివీల్ కానీయకుండా కథ ముందుకెళ్లే విధానం బావుంది. కానీ సినిమాలో లాజిక్స్ మిస్ అయ్యారు. ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తిని ఓ ట్రాఫిక్ పోలీస్ బెదిరించడం, విషం ఇచ్చి చంపేయడం వంటి సన్నివేశాలు చూస్తే షాక్ కాక తప్పదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చుట్టూ ఉండే సెక్యూరిటీ ఏమైయ్యారు? ఏంటి ముఖ్యమంత్రిని చేరుకోవడం ఇంత సులభమా? అనిపించేలా చివర్లో కథను రన్ చేశారు. లాజిక్స్ మిస్సయ్యారనే విషయం కన్నడ సినిమా చూస్తేనే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి తెలుగులో లాజిక్స్ మిస్ అవుతున్నామని యూనిట్ ఆలోచించలేదా? అనే సందేహం వస్తుంది.
మన చుట్టూ ఉన్న అబద్దాలు నిజాలుగా మారి మనల్ని ఏమారుపాటుకి గురి చేస్తాయి. దాన్ని దాటి ఆలోచించినప్పుడు అసలు నిజం తెలుస్తుంది అనే ఓ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘కపటధారి’. చివర్లో కాస్మిక్ లా(మనం చేసే చర్య వెంటనే కాకపోయినా ప్రతిచర్యగా ఎక్కడో మనకు ఎదురవుతుంది) అనే పాయింట్ కూడా యాడ్ చేసి దర్శకుడు తన కథకు ప్రధానంగా చెప్పాలనుకున్న పాయింట్‌కు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. అలాగే రహస్యాలను ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే కొన్ని సందర్భాల్లో విపరీత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పాయింట్‌ను కూడా ఈ సినిమాతో వివరించే ప్రయత్నం చేశారు…