మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన డబుల్ డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌కు రెండోరౌండ్లో గట్టి పోటీ ఎదురైంది. అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫోతో మూడున్నర గంటలపాటు సాగిన ఉత్కంఠ పోరులో జొకో.. టైబ్రేక్‌లో ఓ సెట్‌ను కోల్పోయినా పుంజుకొని పైచేయి సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో జొకో 6-3, 6-7(3), 7-6(2), 6-3తో ఫ్రాన్సె్‌సపై గెలిచాడు. మిగతా టాప్ ఆటగాళ్లలో థీమ్ 6-4, 6-0, 6-2తో కోఫర్‌పై, జ్వెరెవ్ 7-5, 6-4 6-3తో మాక్సిమ్‌పై, ష్వార్జ్‌మన్ 6-2, 6-0, 6-3తో ముల్లర్‌పై, దిమిత్రోవ్ 7-6(1), 6-1, 6-2తో అలెక్స్ బోల్ట్‌పై నెగ్గి మూడోరౌండ్లో ప్రవేశించారు. కాగా, స్విస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా 5-7, 1-6, 6-4, 6-2, 6-7(9)తో హంగేరి ప్లేయర్ మార్టన్ ఫుక్సోవిక్స్ చేతిలో ఓడాడు. నాలుగు గంటలపాటు సాగిన ఈ ఫైట్‌లో ఐదో సెట్ టైబ్రేక్‌లో వావ్రింకా 9-6తో మ్యాచ్ పాయింట్‌పై నిలిచినా అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి మ్యాచ్‌ను అప్పగించాడు.

ఓటమి అంచుల నుంచి..: మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సిమోనా హలెప్ కొద్దిలో ఓటమి తప్పించుకుంది. రెండోరౌండ్లో హలెప్ 4-6, 6-4, 7-5తో అజ్లా టోమ్ల్‌జనోవిచ్‌పై చెమటోడ్చి నెగ్గింది. మిగతా రెండోరౌండ్ మ్యాచుల్లో సెరెనా విలియమ్స్ 6-3, 6-0తో స్టొజెనోవిచ్‌పై, ఒసాకా 6-2, 6-3తో గార్సియాపై, స్వియాటిక్ 6-2, 6-4తో కమిలాపై గెలిచారు. కాగా, యూఎస్ ఓపెన్ మాజీ విజేత బియాంక ఆండ్రెస్క్యూ 3-6, 2-6తో షి సు వి చేతిలో, 9వ సీడ్ క్విటోవా 4-6, 6-1, 1-6తో సొరానా క్రిస్టియా చేతిలో, వీనస్ విలియమ్స్ 1-6, 0-6తో సారా ఎరానీ చేతిలో కంగుతిన్నారు.
బోపన్న జోడీకి నిరాశ: పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న జోడీకి నిరాశ ఎదురైంది. ఆరంభ రౌండ్లో బోపన్న-బెన్ మెక్‌లాచ్లన్ జంట 4-6, 6-7(0)తో కొరియా జోడీ నామ్ జి సంగ్-మిన్ యు సాంగ్ చేతిలో పరాజయం పాలైంది.