‘‘ఉత్తరాంధ్రలో ఎవరినీ బెదిరించం. నా పేరు చెప్పి ఎవరికైనా అలాంటి బెదిరింపులు వస్తే నేరుగా నాకే చెప్పొచ్చు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి సహించం’’… అని ఉత్తరాంధ్రలో అధికార పార్టీ తరఫున చక్రం తిప్పే ఒక ఎంపీ ప్రకటించారు. ‘నిజమే కాబోలు! అంతా స్వచ్ఛంగానే ఉంటుంది! ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తులు భద్రంగా ఉంటాయి’ అని కొంతమందైనా అనుకున్నారు. కానీ… అంతా ఉత్తిదే! అదే నాయకుడు ఇలా చక్రం తిప్పారు! అలా… 111 హెక్టార్ల గని ఆయన సమీప బంధువుకు దఖలు పడింది. వాటా ఇచ్చేందుకు నిరాకరించడంతో… ఏకంగా గనినే సొంతం చేసుకున్నారు. ఆ నాయకుడు తలచుకోగానే… రోడ్డు మెటల్, రాక్‌శాండ్ గని కేటాయింపు నిబంధనలు మారిపోయాయి. గనుల చట్టాలు గల్లంతయ్యాయి. వారు జారీచేసిన హుకుం ముందు… రూల్స్ నలిగిపోయాయి. విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామంలోని గని సదరు ఎంపీ సమీప బంధువుకు 111 హెక్టార్ల గని దొరికింది.
ఎప్పుడో వచ్చినా… అంతే!
గనుల చట్టం ప్రకారం… ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే మైన్స్ కేటాయిస్తారు. అలమండ గ్రామం సర్వే నంబరు 334లో 111 హెక్టార్ల కొండను రోడ్డు మెటల్, రాక్‌శాండ్ కోసం కేటాయించాలని డాక్టర్ జి.సుదర్శనరావు అనే వ్యక్తి 2006 నవంబరు 17న దరఖాస్తు చేసుకున్నారు. అది ప్రభుత్వ భూమే అని 2017లో క్లియరెన్స్ వచ్చింది. ఈలోపు మరో 17 మంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం తొలి దరఖాస్తుదారుడైన సుదర్శన్ రావుకే అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. ‘ఆ భూమిని సర్వే చేస్తున్నాం. వ్యక్తిగతంగా హాజరుకండి’ అని నాటి గనుల శాఖ డీడీ ఆయనకు నోటీసు పంపించారు. అయితే, ఆ సమయంలో ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో దరఖాస్తును తిరస్కరిస్తామంటూ మరో నోటీసు ఇచ్చారు. రెండు నెలల సమయం కావాలని సుదర్శన్‌రావు కోరారు. ఆయనకు ఆ గడువు ఇవ్వాలని విశాఖ మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయనగరం గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కు మెమో జారీచేశారు. దాని ప్రకారం సుదర్శన్‌రావుకు ఏడీ మరో నోటీసు ఇచ్చారు. ‘‘మీ విజ్ఞప్తికి అంగీకరిస్తున్నాం. మీరు దరఖాస్తు చేసుకున్న భూమికి సంబంధించిన స్కెచ్ ఇవ్వాలి. ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం మీరు హెక్టారుకు రూ.10వేల చొప్పున రూ.11,00,000… మరో రూ.4వేలు ఫీజుగా చెల్లించాలి’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత 20 రోజులకు, అంటే 2019 డిసెంబరులో రూ.11లక్షలకు ఒక చలానా, రూ.4వేలకు మరో చలానా తీసి శాఖకు చెల్లించేశారు.
కన్ను పడింది…
నిబంధనల ప్రకారం రుసుము చెల్లించడంతో… 111 హెక్టార్ల గని సుదర్శన్ రావుకు దాదాపుగా కేటాయించినట్లే! కానీ… అంతలోనే చిత్రం మారిపోయింది. గత ఏడాది జనవరి-ఫిబ్రవరిలో అసలు కథ మొదలైంది. ఈ గని విషయం పెద్దలకు తెలిసింది. ‘అంత పెద్ద గనిని ఇంకెవరికో అప్పగించడమా! కనీసం అందులో వాటా అయినా తీసుకోకుండా వదిలేయడమా! నో… నెవ్వర్’ అంటూ గద్దల్లా వాలిపోయారు. ఒక ఎంపీ బంధువు నేరుగా రంగంలోకి దిగారు. ‘మాకు వాటా ఇస్తేనే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి’ అని సుదర్శనరావుకు తేల్చిచెప్పారు. ఆయన అయిష్టంగానే అంగీకరించినట్లు తెలిసింది. 111 హెక్టార్లలో 45 హెక్టార్ల పరిధిలోనే రోడ్డు మెటల్ ఉంది. అందులో 10 ఎకరాలు 2008లోనే మరో కంపెనీకి కేటాయించేశారు. మిగిలిన 35 హెక్టార్లలో 10 హెక్టార్లు పూర్తిగా ఇచ్చేసి, 20 ఎకరాల్లో తాను మైనింగ్ చేసుకుంటానని సుదర్శనరావు సదరు ఎంపీ బంధువుకు తెలిపారు. ఇందుకు వారు తొలుత ‘సరే’ అన్నారు. కొద్దిరోజులకే మనసు మార్చుకున్నారు. ఈసారి ఒక మంత్రి కుమారుడి పేరును తెరపైకి తెచ్చారు. ‘‘నేనూ, ఆ మంత్రి కొడుకూ మాట్లాడుకున్నాం. పది హెక్టార్లు సరిపోదు. మొత్తం గనిలో 85 శాతం మాకే కావాలి’’ అని డిమాండ్ చేశారు. గనికోసం తాను 2006లో దరఖాస్తు చేసుకున్నానని, ఫీజు కూడా కట్టానని, ఇప్పుడు ఇలా అడగడం న్యాయం కాదని సుదర్శన్ వాపోయారు. ‘85 శాతం ఇచ్చి తీరాల్సిందే. లేదంటే ఆ గని నీకు దక్కదు. మొత్తం పోతుంది’ అని ఎంపీ బంధువు తేల్చిచెప్పారు.
అదే జరిగింది…
అదే ప్రాంతం… అదే గని! దానికోసం 2020 అక్టోబరులో అవానిశ్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అవానిశ్ రెడ్డి ఎవరో కాదు! వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరదలి కుమారుడు! సుదర్శన్ రావుది తొలి దరఖాస్తు కాగా.. అవానిశ్ రెడ్డిది 19వ దరఖాస్తు. ఒకవేళ సుదర్శన్‌రావుకు అర్హతలేదని తేలితే… రెండో దరఖాస్తుదారుడికి గని కేటాయించాలి. కానీ… అధికారులు ఒకేసారి ఒకటి నుంచి 19కి వెళ్లిపోయారు. కేవలం 14 రోజుల్లోనే మొత్తం పని పూర్తి చేశారు. ఆ మైన్‌ను అవానిశ్ రెడ్డికి కేటాయించాలంటూ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ (డీఎంజీ) వెంకట రెడ్డికి నివేదిక పంపించారు. ఈ విషయం తెలుసుకున్న సుదర్శన్ రావు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం దీనిపై విచారణ జరిపింది. ఆ గనికోసం దరఖాస్తు చేసుకున్న వారందరినీ పిలిచి మాట్లాడి… న్యాయబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా కేటాయింపు చేయాలని గత ఏడాది నవంబరులో తీర్పిచ్చింది.
వాస్తవాలు దాచేసిన డీఎంజీ
హైకోర్టు ఆదేశాల మేరకు మొదటి దరఖాస్తుదారు సుదర్శన్ రావును డీఎంజీ వెంకటరెడ్డి పిలిచి మాట్లాడారు. తాను మొదటి దరఖాస్తుదారును కనుక, నిబంధనల మేరకు తనకే గని ఇవ్వాలని సుదర్శన్ రావు అడిగారు. తాను అక్కడ రాక్ శాండ్ యూనిట్ కూడా పెడతానని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు గనుల శాఖ డైరెక్టర్ చిత్రమైన ఉత్తర్వులు ఇచ్చేశారు. ఆ గనిని అవానిశ్ రెడ్డికి కేటాయించాలని గనుల శాఖ ఏడీకి ఆదేశాలిచ్చారు. దానికి విచిత్ర కారణం చూపించారు. ‘‘2017లో సుదర్శన్ రావును సర్వేకు రావాలని నోటీసులు ఇవ్వగా…అతను రాలేదు. పైగా నూతన ఇసుక విధానం ప్రకారం ప్రత్యామ్నాయ ఇసుకను ప్రోత్సహించాలి. అవానిశ్ రెడ్డి అక్కడ రాక్‌శాండ్ యూనిట్ పెడతానని ప్రతిపాదించారు. దీంతో ఆయనకే గని ఇవ్వండి’’ అని ఆదేశించారు. సుదర్శన్ రావు 2017లో సర్వేకు హాజరుకాలేదనే సాకు చూపిన డైరెక్టర్… తర్వాతి పరిణామాలను ‘కావాలనే’ విస్మరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే… సర్వేకు హాజరయ్యేందుకు గనుల శాఖ అధికారులే సుదర్శన్‌రావుకు రెండు నెలలు గడువు ఇచ్చారు. ఆయన స్పందనతో వారు సంతృప్తి చెందారు. అన్నింటికంటే ముఖ్యంగా… ఆయన వారు సూచించిన సొమ్ము కూడా చెల్లించారు. డైరెక్టర్ ఇవేవీ పట్టించుకోలేదు. అప్పుడెప్పుడో సర్వే కోసం నోటీసు ఇస్తే రాలేదనే సాకు చూపించి… గనిని విజయసాయి రెడ్డి మరదలి కుమారుడికి కట్టబెట్టారు.
2006లోనే రాక్‌శాండ్
‘అవానిశ్ రెడ్డి అక్కడ రాక్‌శాండ్ యూనిట్ పెడతానని ప్రతిపాదించారు. ప్రభుత్వం దానిని ప్రోత్సహిస్తోంది కాబట్టి… ఆయనకే గని ఇవ్వండి’ అని గనులశాఖ డైరెక్టర్ చెప్పడం మరో పెద్ద వింత. ఎందుకంటే… డాక్టర్ సుదర్శన్ రావు 2006లో గని కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడే… ‘రోడ్డు మెటల్, రాక్‌శాండ్ కోసం’ అని స్పష్టంగా చెప్పారు. ఆయన వేరేచోట రాక్‌శాండ్ యూనిట్ కూడా పెట్టారు. హైకోర్టు తీర్పు తర్వాత డైరెక్టర్ పిలిచి మాట్లాడినప్పుడు… ఆ గనిలో రాక్‌శాండ్ యూనిట్ పెడతాననే ప్రతిపాదనను మరోసారి సమర్పించారు. ఇవేవీ గనులశాఖ డైరెక్టర్‌కు కనిపించలేదు. అవానిశ్ రెడ్డికే గని కేటాయించాలంటూ జనవరి 8వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. సుదర్శన్ రావు మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. డైరెక్టర్ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది.
పెనాల్టీల కొరడా!
సుదర్శన్‌రావును దారికి తెచ్చుకునేందుకు ఆయన నిర్వహిస్తున్న మరో గనిపై జరిమానాల మోత మోగించినట్లు తెలుస్తోంది. ఆయనకు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం పెదరావుపల్లిలో 12 హెక్టార్ల రోడ్డు మెటల్ గని ఉంది. ఈ గనిలో తవ్వకాలపై 2019 ఫిబ్రవరిలో గనుల శాఖ, రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్ అధికారులు సర్వే చేశారు. పరిమితికి మించి తవ్వకాలు జరిపారంటూ రూ.62,20,251 పెనాల్టీ కట్టాలని నోటీసు ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు దానిపై నేరుగా గనుల మంత్రికి రివిజన్ అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మేరకు సుదర్శన్‌రావు రివిజన్ అప్పీలు చేశారు. ఉల్లంఘన కేవలం 6.2 శాతం జరిగిందని అధికారులు తేల్చారని.. 94 శాతం కచ్చితంగా చేసిన ఏ వ్యాపారీ కేవలం ఆరుశాతం ఉల్లంఘన చేయరని లెక్కలతో వివరించారు. దీంతోపాటు వచ్చిన పలు రివిజన్ పిటిషన్లను పరిష్కరించినా… సుదర్శన్‌రావు దరఖాస్తును పెండింగ్‌లోనే ఉంచారు. ఆయనను ‘డిఫాల్టర్’గా చూపించి 111హెక్టార్ల అలమండ మైన్‌ను చేజిక్కించుకునే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బేరం కోసమే ఆపేశారా!
గనుల అధికారుల సూచన మేరకు సుదర్శన్ రావు అదనపు ఫీజు రూ.11 లక్షలు, రూ.4వేలను 2019 డిసెంబరు 25నే చెల్లించారు. కానీ… అధికారులు రెండు నెలలు గని కేటాయించకుండా పెండింగ్‌లో పెట్టేశారు. ‘వాటా’ సంగతి తేలాకే ముందుకెళ్లాలన్న పెద్దల ఒత్తిడే దీనికి కారణమని తెలుస్తోంది.