మడివాల మమత (17) స్వస్థలం హైదరాబాద్‌లోని అల్వాల్. తండ్రి వీరేష్ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కాగా తల్లి భాగ్య కాలనీలోని నాలుగైదు ఇళ్లలో పని చేస్తుంటుంది. ఇదీ మమత కుటుంబ నేపథ్యం. చిన్నతనంలో నాన్నతో కలిసి టీవీలో ఎప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు చూసినా సచిన్, సెహ్వాగ్, ధోనీనే కనిపించేసరికి క్రికెట్ అబ్బాయిలు మాత్రమే ఆడే ఆట అనుకొని మమత భ్రమపడింది. క్రికెటర్ అయితే బాగుంటుందనిపించేది కానీ, చాలా రోజులు తనకు అమ్మాయిల క్రికెట్ ప్రత్యేకంగా ఉంటుందని తెలియదు. క్రికెట్ మీదున్న ఆసక్తితో గల్లీలోని అబ్బాయిలతో కలిసి బొల్లారంలోని పబ్లిక్ గార్డెన్ పక్కన ఉన్న మైదానంలో రోజూ ఆడుతుండేది. అబ్బాయిలకు దీటుగా పరుగులు సాధించడంతో పాటు అద్భుతంగా ఫీల్డింగ్ చేసేది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి.. మమత 14వ ఏట ‘కోచింగ్ ఇప్పిస్తా.. క్రికెటరవుతావా?’ అని అడిగాడు. అయితే తండ్రి తనను ఆటపట్టిస్తున్నాడని భావించింది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఫొటోలు చూపించి అమ్మాయిలకు ప్రత్యేక జట్లు, టోర్నమెంట్లు నిర్వహిస్తారని నాన్న చెప్పడంతో మమతకు పట్టలేని ఆనందం కలిగింది. సికింద్రాబాద్ జింఖానాకు వెళ్లి అక్కడి కోచ్ నూషిన్‌ను కలిశారు. కొద్దిరోజులు ఆమె పర్యవేక్షణలో సాధన చేశాక మమత ఫీల్డింగ్ నైపుణ్యంతో పాటు దేహదారుఢ్యం వికెట్‌కీపింగ్‌కు సరిగ్గా సరిపోతుందని భావించి ఆ దిశగా ఆమెకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది.

4 నెలల్లోనే హెచ్‌సీఏ జట్టులోకి..
నూషిన్ దగ్గర ప్రొఫెషనల్ క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మమత జింఖానా నుంచి ఉప్పల్‌కు తన ప్రాక్టీస్ కేంద్రాన్ని మార్చింది. నాలుగు నెలలు తిరిగేసరికి హెచ్‌సీఏ అండర్- 16 జట్టులో చోటు దక్కించుకుంది. అలా 2016-17లో మమత ప్రొఫెషనల్ కెరీర్ మొదలైంది. ఆ ఏడాది పలు టోర్నమెంట్లకు జట్టులో స్థానం లభించినా ఫైనల్ లెవన్‌లో చోటు దక్కలేదు. హెచ్‌సీఏ లీగ్‌ల్లో బాగా ఆడుతున్నా రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావట్లేదని ఒకానొక సమయంలో కుంగిపోయింది. అప్పుడు తండ్రి వీరేష్ ఆమె వెన్నుతట్టి సీనియర్ పురుష క్రికెటర్లతో కలిసి కఠోరంగా ప్రాక్టీస్ చేయించి మమతను రాటుదేల్చాడు. ఏడాది కిందటి వరకు తుది జట్టులో స్థానం లేని మమత 2018లో అదే జట్టుకు కెప్టెన్ అయింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతు హెచ్‌సీఏ అండర్-19 జట్టులో రెగ్యులర్ కీపర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న మమత ప్రస్తుతం సూరత్‌లో జరుగుతున్న బీసీసీఐ సీనియర్ ఉమెన్ వన్డే టోర్నమెంట్‌లో ఆడుతోంది.
మిథాలీ ప్రేరణతో..: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన తన ఆరాధ్య క్రికెటర్లని మమత తెలిపింది. ‘ప్రతికూల పరిస్థితుల్లో కూడా వికెట్‌ను కాపాడుకుంటూ మిథాలీ బ్యాటింగ్ చేసే తీరు నన్ను తన అభిమానిగా మార్చేసింది. ఇక మంధాన దూకుడైన ఆటతీరంటే ఇష్టం. ముఖ్యంగా బ్యాక్‌ఫుట్ మీద ఆమె ఆడే షాట్లంటే ఇష్టం’ అని మమత చెప్పింది.