స్వాతంత్య్ర పోరాటానికి గాంధీజీ అనుసరించిన వ్యూహ రచనను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే క్రమంలో తాను పుణికి పుచ్చుకున్నానని సీఎం కేసీఆర్ చెప్పారు. అప్ప ట్లో గాంధీతోపాటు స్వాతంత్య్ర పోరాటాల్లో ఉన్నవారు కూడా చాలా సందర్భాల్లో సంశయాలకు గురవుతుండేవారని, ఇది అయ్యేదా.. పొయ్యేదా అని అనుమానం వ్యక్తం చేస్తుండేవారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన సహచరులు కూడా నిరాశా నిస్పృహలకు లోనయ్యారని గుర్తు చేశారు. అయినా, అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నా రు. జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్ర్యాన్ని మరవకుండా అభ్యుదయ పథంలో ప్రగతి కాముకులు గా నిలవాలని పిలుపునిచ్చారు. పబ్లిక్ గార్డెన్‌లో శుక్రవారం ప్రారంభమైన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశ స్వా తంత్య్ర దినోత్సవం ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రాధాన్యాన్ని కోల్పోకూడదని వ్యాఖ్యానించారు. భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచ పోరాటాల్లోనే మహోజ్వలఘట్టమని, దీన్ని గాంధీ ప్రవేశించడానికి ముందు, తర్వాత అని విశ్లేషించి చూడాలన్నారు. గాంధీ నేతృత్వం వహించిన తర్వాత అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయని చెప్పారు. ఆయన ఎంచుకున్న అహింసాయుత, శాంతియుత పంథాలోనే స్వాతంత్య్రం సాకారమైందన్నారు.

ఉద్యమ ఉధృ తి, దానికి అవలంబించాల్సిన కార్యాచరణ, ప్రజలను అందులో మమేకం చేయడంలో మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శప్రాయులుగా నిలిచారని, మానవ హక్కుల కోసం ఉద్యమించిన మార్టిన్ లూథర్‌కింగ్ వంటివారికి గాంధీజీ ఆచరణ, సిద్ధాంతాలు ప్రేరణగా నిలిచాయని గుర్తు చేశారు. దండియాత్ర స్వాతంత్య్ర సముపార్జనలో మహోజ్వల ఘట్టమని, ప్రపంచానికే పాఠం నేర్పిన గొప్ప సన్నివేశమని గుర్తు చేశారు. యాత్రను ముగించిన తర్వాత సముద్ర స్నానం చేసి.. చిటికెడు ఉప్పును సముద్రం నుంచి లేవనెత్తి ‘ఇది బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించే సన్నివేశం’ అని గాంధీ నినదించారని, అది ఉజ్వలమైన ఘట్టమని తెలిపారు. ఆ యాత్రలో హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీనాయుడు కూడా ఉన్నారని, ఆమెతో గొంతు కలిపి ప్రజలంతా నినాదాలు చేశారని వివరించారు. అందుకే, దండి యాత్ర స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం మార్చి 12వ తేదీ నుంచి స్వాతంత్య్ర అమృత ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ‘బ్రిటిష్ పోలీసులు మమ్మల్ని కొట్టినా ఆత్మనిష్ఠతో, కర్తవ్యదీక్షతో ముందుకు సాగుతాం. కానీ మీ లాఠీలకు చేతులు కూడా అడ్డం పెట్టుకోబోమని లార్డ్ ఇర్విన్‌కు రాసి న లేఖలో గాంధీ పే ర్కొన్నా రు. ఆరోజు బ్రిటిష్ పోలీసులు కొడుతుంటే బాధను ఓర్చుకున్నారు. కానీ.. ఎక్కడా హింసకు పాల్పడలేదు. దాంతో ప్రజానీకం హృదయాలు కదిలాయి. లక్షలాది మంది పోరాటంలో భాగస్వాములు కావడానికి అద్భు త ప్రేరణగా నిలిచింది’’ అని కేసీఆర్ వివరించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రజలంతా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
75 వారాల కార్యక్రమాలు: రమణాచారి
భారతదేశ ఘనకిర్తీని, ఘన చరిత్రను స్మరించుకోవడమే కాకుండా వర్తమాన తరానికి, భావితరానికి తెలపడానికి 75వారాలపాటు రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్మన్ కె.రమణాచారి అన్నారు. ఓంకారం నినదించిన.. శాంతిమంత్రం పఠించిన.. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సౌరభాలు పరిమళించిన దేశం మనదని, ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, సాంస్కృతికంగా, వైద్య, విద్యా రంగంలో అగ్రగామిగా ఉన్న దేశ చరిత్రను తెలియజేయడానికి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అద్భుతమైన వేదికని అన్నారు. కార్యక్రమంలో స్పీకర్ పోచారం, మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు.
ఉత్సవాలకు 25 కోట్లు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను దేశవ్యాప్తంగా 75 వారాలపాటు నిర్వహించాలని నిర్ణయించారని, అందుకే, రాష్ట్రంలో కూడా 75 వారాలపాటు నిర్వహించనున్నామని, ఇందుకు రూ.25 కోట్లను కేటాయించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని, దాని స్ఫూర్తిని యువతరానికి, భావితరానికి అందించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వృక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, కళా సాంస్కృతిక ప్రదర్శనలు 75 వారాలపాటు కొనసాగుతాయన్నారు.