అమరావతిః ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బానిసల్లా మార్చే క్రమంలో వారిని విద్యకు దూరం చేయాలనే దురుద్దేశంతో పకడ్బందీగా వైసీపీ సర్కార్ గురుకులాలకు నిధులు విడుదల చేయడం లేదని బీసీ జేఏసీ కన్వీనర్ వల్లిగట్ల రెడ్డప్ప ఒక ప్రకటనలో మంగళవారం విమర్శించారు. ఎన్నో సంక్షేమ పథకాలంటూ ఊదరగొడుతున్న సీఎం జగన్ ఎందుకు.. గురుకుల హాస్టళ్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఒక సంవత్సరంగా విడుదల చేయకపోవడంలో అంతర్యమేంటని ఇందుకు సీఎం సూటిగా సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గురుకులాల సిబ్బందికి 10 నెలలుగా జీతాలు విడుదల చేయకపోవడంతో వారు సరిగ్గా ఎలా పనిచేయగలుగుతారని రెడ్డప్ప ప్రశ్నించారు.

భోజనం మినహా ఏ వసతులూ లేని పరిస్థితి గురుకులాలు, హాస్టళ్లలో దుర్భిక్షం నెలకొందని.. ఏడాదిగా దేనికీ బిల్లులు అందకపోవడంతో.. విద్యార్థులకు దక్కాల్సిన 16 రకాల సౌకర్యాలు ఇప్పటికే బంద్ అయ్యాయని వల్లిగట్ల రెడ్డప్ప అన్నారు. వీటి కోసం కేటాయింపులు చేసినా నిధుల విడుదల నాస్తి అని.. ఖర్చుపెట్టడం లేదంటూ ఏటా గురుకులాల బడ్జెట్ కోత విధంచడం హేయమని చర్య అని ఆయన స్పష్టం చేశారు. పారిశుధ్యం, వంటల కోసం ప్రిన్సిపాళ్ల నానా అవస్థలు పడుతున్నారని, బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల వెనకడుగు వేస్తున్నారన్నారు. కరోనా నివారణ చర్యలు ఏ మాత్రం గురుకులాల్లో లేవని, శానిటైజర్లకూ దిక్కేలేదన్నారు. ఎస్సీ గురుకులాల్లో 1,200 టీచర్ పోస్టులు ఖాళీగా వుంటే.. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రభుత్వం ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతోందన్నారు. మిగతా సంక్షేమ పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
సొసైటీల బడ్జెట్ గతంలో భారీగా ఉండేదని… ఇప్పుడు అందులో కోత పెడుతున్నారని వల్లిగట్ల రెడ్డప్ప తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖకు 2018-19లో రూ.1.050 కోట్లు కేటాయించగా.. 2019-20లో రూ.789 కోట్లకు తగ్గిందని అదే 2020-21లో ఇంకా కుదించి రూ.713 కోట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కాస్మోటిక్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం వుండటం సిగ్గు చేటని, గురుకులాలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలంటేనే సరఫరాదారులు ఆమడదూరం పరుగెడుతున్నారని, బిల్లులు చెల్లించకుండా.. నిత్యవసరాలు సరిగా పంపిణీ చేయకుండా చేసి కుట్రపూరితంగా .. గురుకులాల ప్రాముఖ్యతని తగ్గించే ప్రణాళిక తో సీఎం జగన్ వున్నట్లు స్పష్టం అవుతోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలను కలుపుకొని వీటిపై ఉద్యమం చేస్తామని, ప్రభుత్వం దిగి వచ్చిబిల్లులు చెల్లింపులు జరపకుంటే బహుజనుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.