తానే పెద్ద రైతునని చెప్పుకొనే సీఎం కేసీఆర్.. సాగు చట్టాల విషయంలో అన్నదాతల వైపు ఎందుకు నిలబడట్లేదు? అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నందున, ఆ చట్టాలను అమలు చేయబోమంటూ తక్షణమే శాసనసభలో తీర్మానం చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఈ వెసులుబాటును వినియోగించుకోకుండా కేంద్రం చట్టం తెచ్చింది కాబట్టి కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామంటూ కేసీఆర్ బేలగా మాట్లాడుతున్నారని, ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఈ విషయమై రానున్న మూడేళ్లూ జై కిసాన్ నినాదంతో కాంగ్రెస్ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. ‘‘మోదీ, కేసీఆర్ ఒక్కటయ్యారు. మన సమస్యలపై మనమే పోరాటం చేయాల్సి ఉంటుంది. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించేందుకు పోరాడాలి. ఇందుకోసం ఇంటికొకరు చొప్పున యువత కలిసి రావాలి’’ అని పిలుపునిచ్చారు.

గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలకు సవరణలు తెచ్చి.. దేశాన్ని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీకి అమ్ముడు పోయిన కేసీఆర్.. సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు చేసే ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ చట్టాలు అమలైతే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని, గిట్టుబాటు ధర దక్కదని అన్నారు. సీఎం కేసీఆర్ చెబితేనే రైతులు సన్నరకం ధాన్యం పండించారని, మద్దతు ధరపై రూ.700 బోనస్ కలిపి ఇస్తేనే వారికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతాంగ, నిరుద్యోగ సమస్యలే అజెండాగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని స్పష్టం చేశారు. తన పాదయాత్రకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. సూరీడు తనకు చాలా కాలంగా మిత్రుడని, తాను యాత్ర చేస్తుంటే ఆయనకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉండవచ్చని ఓ ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. ఏఐసీసీ సూచనల మేరకు వ్యవసాయ చట్టాలకు సంబంధించి పార్టీ నేతలు ఎవరు యాత్రలు చేసినా తాను వెళ్తానని, పార్టీ కండువానే తనకు ఆహ్వానమన్నారు. సభకు కొందరు నేతలు రాకపోవడంపై స్పందిస్తూ ఎవరి వెసులుబాటును బట్టి వారు వచ్చారని పేర్కొన్నారు.