గొంతు ఎత్తొద్దనే

0
218
Spread the love

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాను, టీడీపీ సభ్యుల కు వ్యతిరేకంగా పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగంగానే తాజా కేసు నమోదు చేశారన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 12న సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో అరె్‌స్టతో పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మంగళగిరి సీఐడీ పోలీస్‌ స్టేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

గురువారం హైకోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టును అభ్యర్థించారు. సీఐడీ అధికారులు నిబంధనలు పాటించకుండా మాజీ మంత్రి నారాయణ ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ సి. మానవేంద్రనాథ్‌రాయ్‌ వ్యాజ్యాలపై విచారణకు అంగీకరించారు. రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిబ్రవరి 24 ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు.. చంద్రబాబు, పి.నారాయణ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

వ్యాజ్యంలో ఏమన్నారంటే..

‘‘విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేయాలని 2014 సెప్టెంబరు 1న కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై సెప్టెంబరు 4న శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తరువాత భూసమీకరణ ప్రక్రియ కోసం మంత్రివర్గ ఉససంఘాన్ని ఏర్పాటు చేస్తూ సెప్టెంబరు 24న ప్రభుత్వం జీవో జారీ చేసింది. భూయజమానులతో సంప్రదింపులు జరిపి భూసమీకరణ పథకం తీసుకొచ్చాం. 2014 డిసెంబరు22న అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు ప్రవేశట్టాం. డిసెంబరు 30 నుంచి సీఆర్డీఏ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ వివరాలను పరిశీలిస్తే రాజధానికి సంబంధించిన విషయాలన్నీ బహిర్గతమే. భూసమీకరణ నిబంధనలకు సంబంధించి 2015 జనవరి 1న జీవో జారీ చేశాం. భూసమీకరణ కింద అసైన్డ్‌భూముల హ క్కుదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు 2016 ఫిబ్రవరి 17న జీవో 41ని జారీ చేశాం. ముఖ్యమంత్రి ఆమోదానికి ముందే సంబంధిత శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని విషయాలు పరిశీలించారు. చట్ట నిబంధనల మేరకు జీవో జారీ చేశారు. జీవో జారీ చేసిన ఆరేళ్ల తరువాత వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. పిటిషనర్‌, అతని పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తకుండా చేసేందుకు ఇదంతా చేస్తున్నారు’’ అని చంద్రబాబు తెలిపారు.

బాధితులే లేకుండా ఫిర్యాదులా?

‘‘జీవో 41ని జారీ చేయడాన్ని నేరపరిధిలోకి తీసుకురావడానికి వీల్లేదు. ఈ జీవో ఏ చట్టానికీ, నిబంధనలకూ విరుద్ధంగా లేదు. చట్టం సరైన దా? కాదా? లేదా దురుద్దేశంతో తీసుకొచ్చారా అని ఏ పోలీసు అధికారీ విచారించడానికి వీల్లేదు. ఫిర్యాదులోని అంశాలు నిజమేనని భావించినా, అప్పటి సీఎం నేరానికి పాల్పడినట్లు వివరాలు లేవు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం ప్రభుత్వం, అథారిటీ అధికారి తీసుకున్న చర్యలపై ప్రాసిక్యూషన్‌ జరపడంపై నిషేధం ఉంది. నాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేయాలంటే బాధితుడు ఎస్సీ,ఎస్టీ అయి ఉండాలి. తప్పుడు మార్గంలో ఎస్సీ, ఎస్టీ ఆస్తులను ఆక్రమించడం, ఖాళీ చేయించడం జరగాలి. ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు ఆధారంగా తయారుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆ తరహా ఘటనలు చోసుకున్నట్లు వివరాలు లేవు. బాధితులకు సంబంధించిన వివరాలు కూడా లేవు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకొని సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులను కొట్టివేయండి’’ అని చంద్రబాబు కోరారు.

మాజీ మంత్రి నారాయణ మరో వ్యాజ్యం

ఇదే వ్యవహారం పై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. అరె్‌స్టతో పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

నేరం జరిగితే ఆధారాలేవి?

‘‘రాజధాని పరిధిలోని నవలూరు గ్రామస్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఫలానా వ్యక్తి నేరానికి పాల్పడినట్లు నిర్దిష్టమైన ఆరోపణలు చూపించలేదు. యాంత్రికంగా నన్ను నిందితుడిగా పేర్కొన్నారు. సమాజ పురోగతి, ప్రజల ప్రయోజనం కోసం, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు చట్టాలు, నిబంధనలు రూపొందిస్తాయి. అప్పటి ప్రభుత్వంలో జీవో తీసుకొచ్చారు కాబట్టి అప్పటి సీఎంను బాధ్యున్ని చేయడానికి వీల్లేదు. నిబంధనలపై అభ్యంతరాలుంటే ఎమ్మెల్యే కోర్టులో సవాల్‌ చేయవచ్చు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా జీవో 41 ద్వారా నిబంధనలు రూపొందించారనేది ఆరోపణ. ఆ చర్య నేరానికి పాల్పడినట్లు ఎలా అవుతుంది?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here