వెబ్‌ల్యాండ్ మళ్లీ మొండికేసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా పనిచేయడం మానేస్తోంది. ఎప్పుడో అర్ధరాత్రికి గానీ మళ్లీ తెరచుకోదు. సందట్లో సడే మియాలా.. దీన్ని కూడా కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. అది పనిచేసే కాస్త సమయంలోనే సొంత కేసులను సెటిల్ చేస్తున్నారు.
ఇదంతా సర్వర్ డౌన్‌తో వస్తోన్న సమస్య. ఇది కొత్తకాదు. అయినా దాన్ని సరిదిద్దేందుకు శాశ్వత చర్యలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనిపై పనిచేసే రెవెన్యూశాఖ అధికారులు అల్లాడిపోతున్నారు. దీని కారణంగా మ్యుటేషన్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇది సాంకేతిక సమ స్య మనమేం చేయగలం అం టూ రెవెన్యూ బాస్‌లు చేతులెత్తేస్తున్నారు. కాగా, శాశ్వ త ప్రాతిపదికన సాంకేతిక టీమ్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

ఆగిపోతున్న మ్యుటేషన్లు..
వెబ్‌ల్యాండ్, మీ భూమి.. ఈ రెండూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు. భూముల క్రయ, విక్రయాల అనంతరం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌లు వెబ్‌ల్యాండ్ కేంద్రంగా జరుగుతాయి. భూముల రికార్డుల నవీకరణ, సర్టిఫైడ్ నకలు కాపీలు పొందడం, ఫిర్యాదులు అందించేందుకు మీభూమిని ఉపయోగిస్తున్నారు. వెబ్‌ల్యాండ్ డేటాను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు బ్యాంకులు, ఇతర కీలకమైన ప్రభుత్వ శాఖలు పొందగలుగుతాయి. కీలకమైన భూ సంబంధిత సేవలు ఇందులోనే ఉంటాయి. వెబ్‌ల్యాండ్ డేటాలో తప్పులను సరిదిద్దాలంటూ లక్షలాది మంది రైతులు ఇప్పటికీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాగా, వెబ్‌ల్యాండ్ సర్వర్‌లో ఇంకా సమస్యలు వస్తున్నాయి. దీన్ని ఏర్పాటు చేసి ఏడేళ్లు దాటినా, నేటికీ శాశ్వత ప్రాతిపదికన సాంకేతిక బ్యాకప్ టీమ్‌ను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ)పైనే ఆధారపడుతున్నారు. వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్ రూపకల్పనతోపాటు నిర్వహణ ఎన్‌ఐసీ చేతుల్లోనే ఉంది. అయితే, దాన్ని ఉపయోగించేది మాత్రం రెవెన్యూశాఖ.
సర్వర్ డౌన్ కావడం, ఇతర సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు ఎన్‌ఐసీ అధికారులు లోపాన్ని గుర్తించి పరిష్కరిస్తేకానీ సేవలు ముందుకు సాగని పరిస్థితి. గత రెండున్నర నెలలుగా వెబ్‌ల్యాండ్, మీ భూమి సర్వర్లు ఉన్నట్టుండి డౌన్ అవుతున్నాయి. దీంతో రెగ్యులర్ సేవలతోపాటు మ్యుటేషన్లు ఆగిపోతున్నాయి. ఇంతకు ముందు సర్వర్ డౌన్ అయినా, కొద్ది గంటల వ్యవధిలోనే లైవ్‌లోకి వచ్చేది. భూమి రికార్డుల స్వచ్ఛీకరణ(పీవోఎల్‌ఆర్) కూడా వెబ్‌ల్యాండ్ సర్వర్ ఆధారంగానే చేపట్టారు. ఏక కాలంలో ఒకే సర్వర్‌పై రెండు పనులు కొనసాగుతుండటం, సర్వర్ సామర్థ్యం పెంచకపోవడంతో అది భారాన్ని మోయలేక చేతులెత్తేస్తోంది. దీని ప్రభావం భూమి రికార్డుల నవీకరణ, మార్పులు, చేర్పులు, రిజిస్ట్రేషన్లపై చూపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలంటూ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు అనేకసార్లు రెవెన్యూశాఖ దృష్టికి తీసుకొచ్చారు.
అర్ధరాత్రులు..క్యాష్ చేసుకుంటున్నారు..
సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందో అధికారులకు కూడా స్పష్టంగా తెలియదు. కానీ, ఈ సమయాన్ని కూడా కొందరు అవకాశంగా మలుచుకుంటున్నారని తెలిసింది. ఎప్పుడో అర్ధరాత్రి, అపరాత్రి వేళ సర్వర్ పనిచేసినప్పుడు వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు, మ్యుటేషన్లు చేస్తున్నారని, బాగా క్యాష్ చేసుకుంటున్నారని సీసీఎల్‌ఏ కార్యాలయానికి ఫిర్యాదులు రావడంతో రాత్రులు వెబ్‌ల్యాండ్ లాగిన్, లాగౌట్, ఎంట్రీల గురించిన డేటా తెప్పించి పరిశీలించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఏ ఆఫీసులో అర్ధరాత్రి కార్యకలాపాలు చేశారో తెలుస్తుందని నిపుణులు చెప్పినట్టు తెలిసింది.
సీసీఎల్‌ఏకు రెవెన్యూ సంఘం విజ్ఞప్తి
ఈ సమస్య వల్ల తహసీల్దార్లపై అపోహలు వస్తున్నాయి. తమ తప్పులేకున్నా అపవాదులు మో యాల్సి వస్తోందని తహసీల్దార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సర్వర్ సమస్యను పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు, నేతలు చేబ్రోలు కృష్ణమూర్తి, గిరికుమార్‌రెడ్డి ఇటీవల రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై వారు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ నీరభ్ కుమార్‌ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు.
అప్పటిదాకా కష్టాలు తప్పవా?
వెబ్‌ల్యాండ్‌కు, పీవోఎల్‌ఆర్‌కు ఒకే సర్వర్ ఉండటం వల్ల దానిపై భారం పడి, ఒకేసారి షట్‌డౌన్ అవుతోందని నిపుణులు తేల్చారు. దీంతో వెబ్‌ల్యాండ్, పీవోఎల్‌ఆర్‌లకు వేర్వేరుగా సర్వర్లు ఏర్పాటు చేయాలని సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఎన్‌ఐసీని కోరినట్లు తెలిసింది. ఈ అంశంపై మరింత స్పష్టత ఇవ్వాలని సీసీఎల్‌ఏ భావిస్తున్నారు. కొత్తగా మరో సర్వర్ ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు సర్వర్ కష్టాలు తప్పవని అధికారవర్గాలు చెబుతున్నాయి.