వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని మరోసారి గుర్తుచేయాలని ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రణాళికా శాఖపై సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో దివానిర్దేశం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఖచ్చితంగా లెక్కించాలని సూచించారు. అదేసమయంలో ఈ-క్రాప్ వ్యవస్థపై అధ్యయనం చేయాలన్నారు. గ్రామ,మండల స్థాయిల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను, వలంటీర్లను సేవారత్న,సేవామిత్ర, సేవావజ్ర బిరుదులతో ఉగాది రోజు సత్కరించాలని, నగదు బహుమతీ ఇవ్వాలని ఆదేశించారు.

రైతు భరోసా కేంద్రాల పరిధిలో చేస్తున్న ఈ-క్రాపింగ్ డేటాను పరిగణనలోకి తీసుకోవాలని,దీనివల్ల ఈ-క్రాపింగ్ జరుగుతుందా?లేదా?అన్న దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. గ్రామాల్లోని ప్రభుత్వవ్యవస్థల వద్ద ఇంటర్నెట్ పనితీరును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు.