ఫిబ్రవరి 2: గత ఆర్థిక సంవత్సరంలో భారీగా వ్యయం జరిగినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా చెప్పడంపై భిన్నమైన వాదనలు వస్తున్నాయి.

‘‘అందరూ మాకు సలహాలిచ్చేస్తున్నారు. ఆర్థిక పునరుజ్జీవం సాధ్యపడాలంటే ఖర్చు పెంచాలని చెబుతున్నారు. మేం ఎందుకు చేయట్లేదని ఎందుకనుకుంటున్నారు? పెట్టుబడి వ్యయంపై నిరంతర సమీక్ష జరిపి ఖర్చును ప్రోత్సహిస్తూ వచ్చాం. 2020 ఫిబ్రవరిలో ద్రవ్యలోటు 3.5 శాతం ఉండేది. ఇపుడు జీడీపీలో 9.5 శాతానికి పెరుగుతోంది.. వ్యయం పెరగకుండా లోటు ఇంత ఎక్కువకు ఎలా చేరినట్లు? అందుచేత.. మేం ఖర్చు పెట్టాం.. ఖర్చు పెట్టాం… ఖర్చు పెట్టాం…..’’ అని నిర్మల బడ్జెట్ సమర్పణ తరువాత మీడియా సమావేశంలో- మూడుసార్లు నొక్కి మరీ వక్కాణించారు. కానీ 2020- 21 ఆర్థిక సంవత్సర లెక్కలు తీసి సరిచూస్తే ఆమె వాదనకు ఎక్కడా పొంతన కుదరట్లేదు.
గత సంవత్సరం నిర్దేశించుకున్న వ్యయం కంటే రూ 4.1 లక్షల కోట్లు – అంటే 13 శాతం మేర- అదనపు ఖర్చు జరిగినట్లు బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా ఆర్థిక మంత్రులు ఆహార సబ్సిడీ బిల్లును వేరే అకౌంట్ కింద చూపడం వల్ల ద్రవ్యలోటు ఎపుడూ తక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నది బహిరంగ సత్యం. నిర్మల ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ఆహార సబ్సిడీని కూడా బడ్జెట్ లెక్కల్లో చూపారు. ఖర్చుపెరిగిందన్న ఆమె వాదనకు ఇది బలం చేకూర్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నిరుటి అదనపు వ్యయం రూ 4.1 లక్షల కోట్లలో రూ 3 లక్షల కోట్లు ఆహారసబ్సిడీ కింద ఇచ్చినదే! అంటే లాక్‌డౌన్ కాలంలో 80 కోట్ల మంది ప్రజానీకానికి ఏడు నెలల పాటు ఉచితంగా బియ్యం, రేషన్ ఇచ్చామని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నది ఈ సబ్సిడీ కిందకే వస్తుందని అని అనుకుంటే పొరపాటే! ఈ అదనపు వ్యయంలో దాదాపు సగం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి చెల్లించిన పాత బకాయే! అది తీసేయగా మిగిలిన వ్యయం రూ 2.6 లక్షల కోట్లే! ఇక ఎరువుల సబ్సిడీ తీసుకుంటే నిరుడు ప్రభుత్వం అదనంగా కేటాయించినది రూ 63,000 కోట్లు. అంటే 88 శాతం అదనం. ఈ అదనపు కేటాయింపులో రూ 50,000 కోట్లు ఎరువుల సబ్సిడీ కిందా, ఎరువుల కంపెనీలకు పాత బకాయిల కిందా చెల్లించినదే! కాబట్టి, దీన్ని కూడా మినహాయిస్తే అదనపు వ్యయం రూ 2.1 లక్షల కోట్లకు తగ్గుతోంది.
ఇక 2020 బడ్జెట్లో నిర్మల ఎఫ్‌సీఐకి ఆహార సబ్సిడీ నిమిత్తం కేటాయించిన మొత్తం రూ 78,000 కోట్లు. అంతకు ముందటి ఏడాది ఎఫ్‌సీఐ ఈ మొత్తానికి రెట్టింపు మొత్తాన్ని అంటే దాదాపు రూ లక్షన్నర కోట్ల దాకా సబ్సిడీ కింద భరించింది. అయినా నిర్మల కేటాయించినది రూ 78వేల కోట్లే. దీన్ని బట్టి – సుమారు 70-80వేల కోట్ల రూపాయల మైనస్ ఉంది. దీన్ని కూడా మినహాయిస్తే అదనపు వ్యయం లెక్క రూ 1.4 లక్షల కోట్లకు తగ్గుతుంది. అంటే ప్రభుత్వం చెబుతున్న వ్యయం (రూ.4.1 లక్షల కోట్ల)లో కేవలం మూడో వంతు మాత్రమేనని స్పష్టమవుతుందని నిపుణులు లెక్క తీశారు. ఇది జీడీపీలో కేవలం 0.7ు మాత్రమే! దీన్ని బట్టి డిమాండ్ పెంచడానికి చేశామని చెబుతున్న వ్యయం ఆచరణలో జరగలేదని తేలుతోందంటున్నారు.
అదనపు వ్యయం వచ్చేఏడాదీ..
విశేషమేమంటే ఈ అదనపు వ్యయం వచ్చేఏడాది అంటే 2021-22లోనూ కొనసాగుతుందని, 14.5 శాతం మేర పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఓ పక్క రాబడి 12 శాతం తగ్గుతుందన్న అంచనాలున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022లో మొత్తం వ్యయం రూ 34.8 లక్షల కోట్లు. ఇది నిరుటి (30.42 లక్షల కోట్లు) కంటే 4 లక్షల కోట్లు ఎక్కువ. ప్రభుత్వం చెబుతున్న అదనపు వ్యయంలో రూ 1.25 లక్షల కోట్లు ఆహారసబ్సిడీ బిల్లు. కానీ ఇందులో సగానికి పైగా బకాయిలు, చెల్లింపులు నిరుడు జరిగిపోయాయి. అంచేత సిసలైన పెరుగుదల ఇంకాస్త తక్కువే ఉంటుంది. ఇక వడ్డీలకు రూ లక్ష కోట్ల దాకా అవుతుంది. కొవిడ్ వ్యాక్సిన్‌కు కేటాయించిన రూ 35000 కోట్లు కూడా అదనపు వ్యయం కిందే చూపెట్టారు.
అంటే ఈ మూడు పద్దుల కింద- ఆహార సబ్సిడీ, వడ్డీలు, వ్యాక్సిన్‌లకు కలిపి మొత్తం అదనపు వ్యయంలో 60 శాతం పోతుంది. ఇవి తీసేస్తే ఇక మిగిలేది రూ 1.77 లక్షల కోట్లే. ఇది జీడీపీలో కేవలం 0.8 శాతం మాత్రమే! ఈ మిగిలిన అదనపు వ్యయంలోనే హైవేలు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, జల జీవన్‌మిషన్, ఎంఎ్‌సఎంఈలు… ఇలా ఎన్నింటికో కేటాయింపులు జరపాలి. 1.77 లక్షల కోట్లన్నది తక్కువ మొత్తమేమీ కాకపోయినా ప్రస్తుత తరుణంలో డిమాండ్ పెంచడానికి, ఉపాధి కల్పనకు ఇది పెద్దగా ఉపయోగపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.