అరగంటలో 200 కిలోమీటర్లు

0
205
Spread the love

హైటెక్‌ హంగులతో సిద్ధమవుతున్న హైపర్‌లూప్‌!

కొత్త బోగీ డిజైన్‌ విడుదల చేసిన సంస్థ

గంటకు పన్నెండొందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రవాణా వ్యవస్థ హైపర్‌లూప్‌ కొంగొత్త రూపు సంతరించుకుంది. శూన్యంతో కూడిన గొట్టాల్లో అయస్కాంత క్షేత్రాలపై తేలియాడుతూ వెళ్లే హైపర్‌లూప్‌ బోగీలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకొన్నేళ్ల సమయం పడుతుంది. కానీ ఇందుకు సన్నాహాలు మాత్రం జోరందుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితమే భారతీయ ఇంజనీర్‌ తనయ్‌ మంజ్రేకర్‌ హైపర్‌లూప్‌లో ప్రయాణించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించగా.. తాజాగా వర్జిన్‌ హైపర్‌లూప్‌ సంస్థ కొత్త పాడ్‌(బోగీ) డిజైన్‌ను విడుదల చేసింది. కమర్షియల్‌ వెహికల్‌ అని పిలుస్తున్న పాడ్‌లో చాలా హైటెక్‌ హంగులను సమకూర్చారు. వైర్‌లెస్‌ చార్జింగ్‌ వీటిల్లో ఒకటైతే.. సహజ వెలుతురును ప్రతిబింబించేలా ‘ఆర్టిఫిషియల్‌ స్కైలైట్‌’ మరొకటి. ఒక్కో పాడ్‌లో 28 మంది సులభంగా కూర్చుని ప్రయాణించవచ్చు.
అతి త్వరలో వాణిజ్య స్థాయి వినియోగం..
ఈ హైపర్‌లూప్‌లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు కారు ప్రయాణానికి దాదాపు సమానంగా, విమాన చార్జీలకంటే తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గంటల సమయం పట్టే ప్రయాణాలను నిమిషాల్లో పూర్తి చేయగలిగితే సమయం ఆదా అవు తుందని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ చైర్మన్, డీపీ వరల్డ్‌ సీఈవో సుల్తాన్‌ బిన్‌ సులాయెం తెలిపారు. హైపర్‌లూప్‌ టెక్నాలజీ సామర్థ్యాన్ని తాము ఇప్పటికే ప్రపంచానికి తెలిపామని, అతి త్వరలో వాణిజ్యస్థాయి వినియోగమూ మొదలవుతుందని ఆయన వివరించారు. ముంబై నుంచి పుణేకు ఉన్న దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని హైపర్‌లూప్‌లో అరగంటలో ముగించవచ్చునని వర్జిన్‌ హైపర్‌లూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ ఇండియా) హర్జ్‌ ధలీవాల్‌ తెలిపారు. మహారాష్ట్రతోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో హైపర్‌లూప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here