అసమ్మతి రాజ్యాంగ హక్కు

0
167
Spread the love

టూల్‌కిట్‌ కేసులో యువ పర్యావరణ కార్యకర్త దిశ రవికి ఢిల్లీలోని పటియాల హౌస్‌లోని ఓ కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ‘‘పోలీసులు సమర్పించిన ఆధారాలు అరకొరగా, రేఖామాత్రంగా ఉన్నాయి. సహేతుకంగా లేవు. ఆమెకు నేరచరిత్ర ఏమీ లేదు. ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఊతమిస్తోందని చెబుతున్న సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే)తో సంబంధమున్నట్లు చూపే ప్రత్యక్ష సాక్ష్యాధారాలేవీ లేవు. పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌తో (పీజేఎ్‌ఫతో) గానీ, జనవరి 26న చోటుచేసుకున్న హింసతో గానీ ఆమెకు ప్రమేయమున్నట్లు చూపే ఆధారాల్లేవు. దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ఆమె కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు నాకు రెండు వెబ్‌సైట్ల హైపర్‌లింక్స్‌ చూపారు. వాటిలో అభ్యంతరకరమైనవేవీ నాకు కనిపించలేదు. ఆలోచనలు తప్పు కావొచ్చు, అతిశయోక్తి ఉండొచ్చు, ఆఖరికి కలహ కారణమైన దుర్మార్గమైనవీ కావొచ్చు.. కానీ హింసను ప్రేరేపించనంతకాలం వాటిని దేశద్రోహం కింద జమకట్టడం సరికాదు…’’ అని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా పేర్కొన్నారు. ‘‘పోలీసులు ఇంకా ఆధారాల సేకరణలో ఉన్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించలేం..బెయిల్‌ నిరాకరించేందుకు సరైన కారణాలేవీ నాకు కనిపించలేదు’’ అని ఆయనన్నారు. ‘చూస్తుంటే బెయిల్‌కు పోలీసులు అడ్డుపడడం కేవలం అలంకారప్రాయంగా తోస్తోంది’ అని వ్యాఖ్యానించారు. రూ. లక్ష పూచీకత్తుతో పాటు అంతే మొత్తంలో రెండు సమానమైన హామీలను కూడా ఆమె సమర్పించాల్సి ఉంటుందని ఆయన తీర్పిచ్చారు. దీంతో తిహార్‌ జైలు నుంచి దిశ రవి బుధవారం రాత్రి విడుదలయ్యారు.

పోలీసులకు చివాట్లు

ఈ తీర్పులో జడ్జి ఢిల్లీ పోలీసుల తీరును, పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రభుత్వ మనస్సాక్షిని, ధర్మాన్ని పరిరక్షించేది పౌరులే. కేవలం తాము చేసే విధానాలను, చట్టాలను వ్యతిరేకించారన్న కారణంతో ప్రభుత్వాలు పౌరులను కటకటాల్లోకి తోయడం సమ్మతం కాదు. ప్రభుత్వాల అహం, అభిమానం గాయపడిందన్న నెపంతో దేశద్రోహం కేసును నమోదుచేయరాదు.. అసమ్మతి వ్యక్తీకరణ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. 19వ అధికరణం కింద స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించే ఈ హక్కు …అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు, సంస్థలు వాటిని వినడాన్ని కూడా కల్పిస్తుంది. భేదాభిప్రాయాలు, అసమ్మతి, విభేదం, విరోధం ఇవన్నీ ప్రభుత్వ విధానాలపై నిష్పాక్షిక దృక్పథం కలిగించే ఉపకరణాలు. చైతన్యవంతంగా, నిర్భీతిగా మనోభావాలు వెల్లడించే పౌరసమాజం ఉండటం ఓ సజీవమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చిహ్నం’’ అని ధర్మేంద్ర రాణా పేర్కొన్నారు. ‘‘మనది 5000 సంవత్సరాల నాగరికత. సదాశయాలు, సమున్నతమైన ఆలోచనలు అన్ని దిశల నుంచీ రావాలని రుగ్వేదం చెబుతోంది. ప్రాచీన నాగరికత విభిన్న ఆలోచనలను, అభిప్రాయభేదాలను స్వాగతించింది….గౌరవించింది. మన సాంస్కృతిక వారసత్వం విభిన్నతకు ప్రతిబింబం’’ అని రాణా వివరించారు.

వ్యవస్థపై నమ్మకం కలిగింది: దిశ తల్లి

దిశా రవికి బెయిల్‌ మంజూరు చేయడం ఊరటనిస్తోందని ఆమె తల్లి మంజులా రవి అన్నారు. ఈ తీర్పు తమకు వ్యవస్థపై మళ్లీ నమ్మకం కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా.. బెయిల్‌ నిమిత్తం ఏకంగా రూ. లక్ష చెల్లించడం వారికి భారమని, అంత డబ్బు దిశ కుటుంబం వద్ద లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టు బయట చెప్పారు. ఇదే కేసులో నిందితుడిగా పోలీసులు చెబుతున్న మరో వ్యక్తి శంతను ములుక్‌ రెగ్యులర్‌ ముందస్తు బెయిల్‌ కోసం అర్జీ పెట్టుకున్నారు. దాన్ని కోర్టు బుధవారంనాడు ఆలకించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here