ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒక్క అసోం మినహా మిగిలిన చోట్ల బీజేపీ ఓడిపోతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికలు దేశానికి ఒక దిశానిర్దేశం చేయనున్నాయన్నారు. మహారాష్ట్రలోని పుణే జిల్లా బారమతిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్-మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయిదు చోట్ల ఫలితాలపై ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. కేరళలో వామపక్షాలు, ఎన్‌సీపీ కలిసి పనిచేస్తున్నాయని, అక్కడ తాము స్పష్టమైన మెజార్టీ సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

తమిళనాడు ప్రజలు డీఎంకే పార్టీకే మద్దతు ఇస్తున్నారని, అక్కడ ఎంకే స్టాలిన్ అధికారంలోకి వస్తారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో కేంద్రం, ముఖ్యంగా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజల కోసం పోరాడుతున్న సోదరి(మమతా బెనర్జీ)పై దాడిచేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అక్కడ మమత నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధికారం నిలుపుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదన్నారు.