ఢిల్లీ నడిబొడ్డున ఇజ్రాయెల్ రాజధాని కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల వేళ బాంబు పేలుడు సంభవించింది. ఎవరూ చనిపోలేదు, గాయపడలేదు. సమీపంలోని కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. తక్కువ తీవ్రత ఉన్న అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ)ను గుర్తు తెలియని వ్యక్తులు పేల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పేలుడు జరిగిన ప్రదేశానికి కేవలం 1.4 కిమీ దూరంలోనే విజయ్ చౌక్ ఉంది.రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమాల ముగింపును సూచించే బీటింగ్ రిట్రీట్‌కు రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు విజయ్ చౌక్ వద్దకు హాజరై దాన్ని తిలకిస్తున్న సమయంలోనే ఇది చోటు చేసుకుంది. దీంతో కేంద్రం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ పేలుడుపై హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.కాగా, ఇది ఉగ్రవాద చర్యేనని ఇజ్రాయెల్ అంటోంది. పశ్చిమాసియాలో, ఇస్లామిక్ ప్రపంచంలో తమకు ప్రతికూలంగా ఉన్న కొన్ని శక్తులు దీని వెనుక ఉండి ఉండొచ్చని అనుమానిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గబీ ఏష్కనాజీతో ఫోన్లో మాట్లాడారు. దీనిని సీరియ్‌సగా తీసుకుంటున్నట్లు చెబుతూ ఇజ్రాయెలీ దౌత్య సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.