ఏ వర్గాన్నీ మచ్చిక చేయం

0
169
Spread the love

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తాము ఏ వర్గాన్నీ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బలమైన ఓటు బ్యాంకైన ముస్లింలను మంచి చేసుకునేందుకు టీఎంసీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా విమర్శిస్తూ- ‘అన్ని వర్గా లూ మాకు సమానమే. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌.. అనేది మేం అనుసరించే సిద్ధాంతం. బెంగాల్లో (బంగ్లాదేశీ) చొరబాట్లకు తావివ్వం. వామపక్షాల నుంచి అధికారాన్ని కైవ సం చేసుకున్ననాడు రాష్ట్రంలో మార్పు తెస్తామని మమత హామీ ఇచ్చారు. ఏదీ ఆ మార్పు? బీజేపీకి అధికారమిస్తే రాష్ట్రంలో సిసలైన మార్పు తీసుకొస్తాం. బంగారు బెంగాల్‌ చేస్తాం’ అని ఆదివారం బ్రిగేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ ఎన్నికల సభలో ఆయన చెప్పా రు. ‘మమత సృష్టించిన బురదలో నుంచి కమలం వికసించబోతోంది. మత ప్రాతిపదికన రాష్ట్రాన్ని చీల్చారు. అందుకే కమలం వికసించింది. నియోజకవర్గాన్ని మార్చుకున్న దీదీ.. మీ స్కూటీ నందిగ్రామ్‌లో నేలకూలడం ఖాయం’’ అని మోదీ వ్యాఖ్యానించారు ‘మిమ్మల్ని ప్రజలు ఆప్యాయంగా దీదీ అని పిలుచుకున్నారు. కానీ మీరు దీదీగా ఉండలేదు. మీ భతీజా (మేనల్లుడు)కి బువా (అత్త)గా మాత్రమే ఉండిపోయారు’ అని మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. అభిషేక్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే మమత తాపత్రయపడుతున్నారని మోదీ పేర్కొన్నారు. అంబానీ, అదానీసహా కొందరు పరిశ్రమాధిపతులకు అంతా దోచిపెడుతున్నారని రాహుల్‌ విమర్శలను తిప్పికొడుతూ ‘నేను పుట్టి పెరిగిన బాల్యం, నా సాధారణ నేపథ్యం స్నేహం తాలూకు విలువను నాకు నేర్పాయి. ఏ కొద్ది మందో కాదు, దేశంలోని 130 కోట్ల మంది నాకు స్నేహితులే.

90 లక్షల మంది బెంగాలీ స్నేహితులకు గ్యాస్‌ సిలిండర్లిచ్చాను’ అని మోదీ వివరించారు. తమను బయటివారు అని ప్రత్యర్థి పార్టీలు నిందించడాన్ని కూడా మోదీ నిరసించారు. ‘మార్క్స్‌-ఎంగెల్స్‌ లాంటి వారి సిద్ధాంతాలతో ఊపిరిపోసుకున్న లెఫ్ట్‌ పార్టీలు పరాయి పార్టీలు కాదు. కాంగ్రెస్‌ నుంచి వేరుపడి ఆవిర్భవించిన తృణమూల్‌ పరాయి పార్టీకాదు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్ఫూర్తి, ఆలోచనలతో రూపుదిద్దుకున్న బీజేపీ మాత్రం పరాయిపార్టీ. ఇదేం నీతి?’ అని మోదీ వ్యాఖ్యానించారు. మా, మనుష్‌, మాటీ అనే మమత నినాదాన్ని ప్రస్తావిస్తూ బెంగాల్‌లో మాతృమూర్తులపై దాడులు పెచ్చరిల్లాయని, ఈ మధ్య ఓ 80 ఏళ్ల మహిళపై దాడి జరిగిందని మోదీ అన్నారు. మోదీ సభలోనే ఒకప్పటి బాలీవుడ్‌ హీరో మిథున్‌ చక్రవర్తి బీజేపీ కండువా కప్పుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here