సామాజిక మాధ్యమాలు, ఓవర్-ద-టాప్ (ఓటీటీ)లపై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన మార్గదర్శకాలకు కోరల్లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్‌కు అధికారాలను ఇవ్వకపోవడాన్ని ఎత్తిచూపింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న వెబ్‌సిరీస్ ‘తాండవ్’లో హిందువులను కించపరుస్తున్నారంటూ దాఖలైన కేసులపై.. ఆ సంస్థ భారత్ చీఫ్ అపర్ణ పురోహిత్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్‌ఎస్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోమారు విచారించింది. గురువారం నాటి విచారణ సందర్భంగా ఓటీటీలపై నియంత్రణకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కొన్ని గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేసి, సామాజిక మాధ్యమాలపై నియంత్రణకు రూపొందించిన మార్గదర్శకాలతోపాటు కోర్టుకు సమర్పించింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మీరు సమర్పించిన గైడ్‌లైన్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం.

వాటికి ఏమాత్రం కోరల్లేవు. తప్పు చేసిన ఓటీటీ సంస్థలపై చర్యలకు అవకాశాల్లేవు. ప్రాసిక్యూషన్‌కు అధికారాల్లేవు. ప్రభుత్వం దీన్ని ఓ చట్టంగా తీసుకురావడమే పరిష్కారం. ఈ మార్గదర్శకాలకు సవరణలు చేసి, మరోమారు సమర్పించండి’’ అని ఆదేశించింది. కాగా.. ఉత్తరప్రదేశ్ హైకోర్టు తిరస్కరించిన అపర్ణ పురోహిత్ పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ.. ఆమెకు ముందస్తు బెయిల్ విషయంలో ఊరటనిచ్చింది. ఈ వ్యాజ్యంలో కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని ఆమెకు సూచించింది.