గట్టెక్కిన ట్రంప్‌

0
153
Spread the love

అభిశంసనకు గురికాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు తప్పించుకున్నారు. ప్రతినిధుల సభ అభిశంసించినా కీలకమైన సెనెట్‌లో మాత్రం తీర్మానం వీగిపోయింది. 100 మంది సభ్యులున్న సెనెట్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లకు చెరి సగం సీట్లున్నాయి. తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. అంటే అభిశంసన తీర్మానానికి కనీసం 67 మంది మద్దతు కావా లి. కానీ అనుకూలంగా 57 ఓట్లు, వ్యతిరేకంగా 43 ఓట్లు పడ్డాయి. అంటే అభిశంసనకు పది ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో అభిశంసనను రెండుసార్లు ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా చరిత్రకెక్కకుండా ట్రంప్‌ గట్టెక్కగలిగారు. డెమొక్రాట్లకు తోడు ఏడుగురు రిపబ్లికన్లు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయడం విశేషం. సెనెట్‌లో ఆయనకు అనుకూలంగా ఓటేసి గట్టెక్కించినప్పటికీ ఇక ఆయనతో సంబంధం లేదని రిపబ్లికన్‌ నేత మిచ్‌ మెకానిల్‌ స్పష్టంగా ప్రకటించేశారు. ‘కేపిటల్‌ హిల్‌పై దాడి ఘటనకు ఆయనే బాధ్యుడు. కానీ రాజ్యాంగం ప్రకారం… పదవి నుంచి నిష్క్రమించిన అధ్యక్షుణ్ని అభిశంసించడం కుదరదు. అందుకే ఆయనకు అనుకూలంగా నిలిచాం..’ అని అన్నారు. పార్టీకి మరింత చెడ్డపేరు రాకుండా చూసేందుకే అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసినట్లు రిపబ్లికన్‌ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం వ్యవహారంలో ట్రంప్‌ను నిరుడు ఫిబ్రవరి 5న జరిగిన ఓటింగ్‌లో కూడా సెనెట్‌లోని రిపబ్లికన్లు గట్టెక్కించారు. ఇపుడు ఒకవేళ సెనెట్‌ గనక ట్రంప్‌ను దోషిగా తేల్చి ఉంటే మళ్లీ జీవితంలో అధ్యక్ష పదవికి పోటీచేయకుండా సెనెట్‌ ఆయనను నిషేధించగలిగి ఉండేది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌ జనవరి 6న కేపిటల్‌ హిల్‌పై దాడికి అనుచరులను స్వయంగా పురిగొల్పినట్లు ఆరోపణలెదుర్కొన్నారు. కాగా, చరిత్రలో అత్యంత దారుణమైన కక్షసాధింపు చర్య ఇదేనని, ఈ స్థితిని గతంలో ఏ అధ్యక్షు డూ ఎదుర్కొనలేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘మళ్లీ నన్ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుపడదామనుకున్న డెమాక్రాట్ల ఆశలు నెరవేరలేదు.

అమెరికాను మళ్లీ గొప్పదేశంగా చేసే చరిత్రాత్మకమైన, దేశభక్తి ప్రపూర్ణమైన ఉద్యమం ఇపుడే ఆరంభమైంది. రాబోయే నెలల్లో నేను మీతో మరిన్ని విషయాలు పంచుకుంటాను’ అని ట్రంప్‌ ఫ్లోరిడా నివాసం నుంచి చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందన్న విషయాన్ని తెలియజెప్పాయని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అమెరికా సమాజంలో హింసావిధ్వంసాలకు తావులేదని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here