మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా….. అన్న విషయాన్ని తేల్చడానికి స్వచ్ఛందంగా చేపట్టిన విచారణను సుప్రీంకోర్టు మూసేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా వ్యవహారం ఉందని భావించి సుమోటోగా నమోదుచేసిన కేసును 22నెలల పాటు పరిశీలించిన అనంతరం జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియంలతో కూడిన ధర్మాసనం చివరకు దాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది.

‘రిటైర్డ్ జడ్జి జస్టిస్ పట్నాయక్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఏకసభ్య విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించాం. లైంగిక వేధింపులు కుట్రపూరితం కావొచ్చని, ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని కమిషన్ అభిప్రాయపడింది. కుట్ర జరిగినట్లు లాయర్ ఉత్సవ్ బెయిన్స్ చేసిన ఆరోపణను నిరూపించే సాక్ష్యాలుగానీ, ఎలకా్ట్రనిక్ ఆధారాలుగానీ ఏమీ లభించలేదు. ఇంకా కేసును కొనసాగించడం అనవసరమని భావిస్తున్నాం’’ అని జస్టిస్ కౌల్ తన తీర్పులో వెల్లడించారు. కాగా, కేసు నేపథ్యంలోకి వెళితే.. 2019లో సీజేగా ఉన్న సమయంలో గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ ఆయన చాంబర్లో పనిచేసిన ఓ ఉద్యోగిని ఆరోపించారు. తన మీద తానే త్రిసభ్య బెంచ్‌ను జస్టిస్ గొగోయ్ ఏర్పాటు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే స్వయంగా ఎలా విచారణ జరుపుతారని నిపుణులు విమర్శించడంతో గొగోయ్ తప్పుకుని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో ఓ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. జస్టిస్ పట్నాయక్ కమిటీని ఏర్పాటు చేసినది ఈ బెంచే! జస్టిస్ గొగోయ్‌ను ఇరికించడానికి కొందరు తనకు రూ.కోటిన్నర సొమ్ము ఎరజూపారని లాయర్ ఉత్సవ్ బెయిన్స్ వెల్లడించారు. చివరకు పట్నాయక్ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. అది ఏమైందో తెలియదు. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలు రిటైర్ కావడంతో కేసు వేరే బెంచ్‌కు వెళ్లింది. పట్నాయక్ కమిటీతో పాటు సుప్రీంకోర్టు ఈ లైంగిక వేధింపుల ఆరోపణపై జస్టిస్ బోబ్డే సారథ్యంలో ఓ అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపి గొగోయ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది.