
సాగుచట్టాలపై నిరసనలకు సంబంధించి ‘టూల్‌కిట్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది నికితా జాకబ్‌కు బాంబే హైకోర్టు 3 వారాల ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తిపై మరొక రాష్ట్రంలో కేసు నమోదైతే, సొంత రాష్ట్రంలో ఇచ్చే ముందస్తు బెయిల్‌ను ‘ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్’గా వ్యవహరిస్తారు ఇదే కేసులో శంతను ములుక్‌కు కూడా బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ అదే బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీసులుగా చెప్పుకొన్న ఇద్దరు వ్యక్తులు ఫిబ్రవరి 12న తమ ఇంట్లో సోదాలు చేసి కంప్యూటర్ హార్డ్ డిస్కును, మరికొన్ని వస్తువులను పట్టుకెళ్లారని శంతను ములుక్ తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారత రైతులకు మద్దతుగా..
న్యూయార్క్ టైమ్స్‌లో ఫుల్ పేజీ ప్రకటన
ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా న్యూయార్క్‌టైమ్స్‌లో ఫుల్ పేజీ వాణిజ్య ప్రకటన ప్రచురితమైంది. అమెరికాకు చెందిన ‘జస్టిస్ ఫర్ మైగ్రెంట్ ఉమెన్’ సంస్థ ఈ ప్రకటన ఇచ్చింది. ‘‘భారత రైతులకు.. మానవ చరిత్రలోనే అతిపెద్ద నిరసనల్లో ఒకదానికి మీరు శ్రీకారం చుట్టారు. ప్రపంచమంతా.. మీ గళాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మీకు మద్దతుగా మేము కూడా గళమెత్తుతున్నాం’’ అని అందులో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 75 పౌర హక్కుల, న్యాయ, సామాజిక సంస్థలు ఈ ప్రకటనకు మద్దతిచ్చాయి.