పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందంటూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై బుధవారం ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్‌దాస్ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ ముగించింది.

ఏపీ సర్కారు తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేపట్టడం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్వయంగా అఫిడవిట్ దాఖలు చేశారని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని మార్చడానికి కూడా అధ్యయనం జరుగుతోందని వివరించారు. డీపీఆర్‌లను రూపొందించడానికి అక్కడ సన్నాహక పనులే చేశారని, ప్రాజెక్టు పనులు కాదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. వెంకటరమణి వాదనతో పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ విబేధించారు.
తాము రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆదిత్యానాథ్ దాస్ గతంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారన్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న ఫోటోలను శ్రవణ్ కుమార్ ధర్మాసనానికి అందించారు.
వాటిని పరిశీలించిన ధర్మాసనం.. ‘‘ఇవి డీపీఆర్ రూపొందించడానికి అధ్యయనం చేస్తున్న పనుల్లా కనిపించడం లేదు. ట్రక్కులు, భారీ వాహనాలు మోహరించాయి. అయినా డీపీఆర్ రూపకల్పనకే అని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌ను తోసిపుచ్చలేం’’ అని వ్యాఖ్యానించింది. తెలంగాణ అభ్యంతరాలు కేఆర్‌ఎంబీ పరిధిలో ఉన్నందున త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించి పనులు జరుపుతున్నట్లు కేఆర్‌ఎంబీ తేల్చితే మరోసారి ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయడానికి శ్రీనివా్‌సకు వెసులుబాటు కల్పించింది.