‘పెట్రో’ ధరలు పైపైకే..

0
266
Spread the love

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పెట్రో ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. ధరలు సరికొత్త శిఖరాలకు చేరుతుంటే.. వాహనదారులపై భారం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రభుత్వరంగ చమురు సంస్థలు సోమవారం లీటరు పెట్రోల్‌ ధరను 26 పైసలు, డీజిల్‌ ధరను 29 పైసలు పెంచాయి. దీంతో వరుసగా ఏడో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినట్టయింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర సరికొత్త రికార్డు స్థాయి రూ.88.99కి చేరింది. ముంబైలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పెట్రోల్‌ ధర రూ.95.46కి చేరుకుంది. లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.79.35కు చేరగా.. ముంబైలో రూ.86.34కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.92.53, డీజిల్‌ ధర రూ.86.55గా ఉంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ ధర రూ.100కు చేరువైంది. ప్రస్తుతం ఈ పట్టణంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.99.56గా ఉంది. డీజిల్‌ ధర రూ.91.48 పలుకుతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని చాలా నగరాల్లో పెట్రోల్‌ ధర రూ.100కు చేరువలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా ఇంధనాలపై వ్యాట్‌ ఉండటమే కారణం.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బ్రాండెడ్‌ పెట్రోల్‌ ధర ఆదివారం నాడే రూ.100 దాటేసింది. శ్రీగంగానగర్‌లో బ్రాండెడ్‌ పెట్రోల్‌ ధర లీటరుకు రూ.102.34, డీజిల్‌ ధర రూ.95.15గా ఉంది. ఇదిలా ఉంటే.. ఏడు రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.2.04, డీజిల్‌ ధర రూ.2.22 పెరిగింది. చమురు సెగతో వాహనదారులు విలవిల్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ధరల తగ్గింపునకు సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించడం లేదు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 63.20 డాలర్ల ఎగువనే కదలాడుతోంది. ధర ఇంకా పెరిగితే దేశీయ మార్కెట్లో పెట్రో ధరలు మరింత మండిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here