భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత.. బంగ్లాదేశ్‌లో హింస పెట్రేగుతోంది. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్ర, శనివారాల్లో మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనను నిరసిస్తూ ఇస్లామిక్ వాదులు శుక్రవారం నుంచి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మోదీ సర్కారు హయాంలో భారత్‌లో ముస్లింలపై వివక్ష పెరుగుతోందని ఆరోపిస్తూ.. హిఫాజత్-ఎ-ఇస్లాం ఆధ్వర్యంలో వందల మంది ఆందోళనకారులు శుక్రవారం నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం అవి తారాస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ఎక్కడికక్కడ బస్సులకు నిప్పంటించారు. రైళ్లను తగులబెట్టారు. బ్రాహ్మణ్‌బరియాలో ఓ రైలింజన్‌ను ధ్వంసం చేసి.. బోగీలన్నింటికీ నిప్పు పెట్టారు. ఈ దాడిలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రాజ్‌షాహీలో రెండు బస్సులను తగులబెట్టి, రోడ్డును బ్లాక్ చేశారు. రాజధాని నగరం ఢాకా సహా.. శివార్లు, పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లదాడికి దిగారు. బ్రాహ్మణ్‌బరియాలో ప్రెస్‌క్లబ్‌కు సైతం నిప్పు పెట్టారని జావెద్ రహీం అనే విలేకరి తెలిపారు. ఢాకా వీధుల్లో నిరసనకారులు హోరెత్తించారు. విద్యుత్తు స్తంభాలను కూల్చివేసి, కాల్చిన టైర్లతో రోడ్లను బ్లాక్ చేశారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 11 మంది మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు.
