ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓ రకంగా అగ్ని పరీక్ష ఎదుర్కోబోతోంది. సాగు చట్టాలపై రైతుల వ్యతిరేకత, ప్రైవేటీకరణ, నిరుద్యోగం, పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఆర్థిక ఇబ్బందుల వంటి అనేక సమస్యలు మోదీ- షా సారథ్య బీజేపీకి పెనుసవాల్ విసురుతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్ట్టీ విజయం సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ఆకర్షణ, హిందూ ఓట్లు సంఘటితం కావడం ఎంతవరకూ తోడ్పడతాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్ పట్ల ఉన్న ప్రజావ్యతిరేకత తోపాటు హిందూ ఓట్లను సంఘటితం చేసేందుకు గత అయిదేళ్లుగా బీజేపీ చేస్తున్న వ్యూహరచన ఎంత మేరకు సఫలమవుతుందన్నది చూడాలి. ఇక అసొం, ,కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతినే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు జాతీయ రాజకీయాలపైనా ప్రభావం చూపుతాయని, ప్రతిపక్షాల ఐక్యతకు దారితీసే అవకాశాలున్నాయన్నది అంచనా .

బెంగాల్… బీజేపీ చావో రేవో!
పశ్చిమ బెంగాల్ లో 1989లో కేవలం 2 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 2019 నాటికి తన ఓట్ల శాతాన్ని 40 శాతానికి పెంచుకోగలిగింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 22 లోక్ సభ సీట్లను సాధించిన తర్వాత తృణమూల్ కాంగ్రె్‌సకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. లోక్ సభలో గెలిచినసీట్ల ఆధారంగాచూస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపుగా 126 సీట్లు గెలుచుకుంటుందని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాల అంచనా. అయితే లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని, సార్వత్రిక ఎన్నికలకూ, స్థానిక ఎన్నికలకూ తేడా ఉన్నదని వాదించేవారు ఉన్నారు. బెంగాల్‌లో గెలిచి దేశమంతా తమ పట్టుసాఽధించామని చెప్పుకొనేందుకు మోదీ, అమిత్ షాలు తీవ్ర కృషి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు బీజేపీకి వలసపోయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల బలంతో దీటు రాగల కేడర్ బీజేపీకి లేదని మరికొందరు పరిశీలకుల అంచనా.
ఇక బీజేపీ తప్పనిసరిగా గెలవాలంటే మోదీకి అనుకూలంగా పశ్చిమ బెంగాల్ లో హిందూ ప్రభంజనం వీయాలని, ప్రస్తుతం ఆ అవకాశాలు లేవని అంటున్నారు. అదే సమయంలో ముస్లింలు సంఘటితంగా బీజేపీ-వ్యతిరేక పార్టీలకు ఓట్లు వేసే అవకాశాలు హెచ్చు. కాంగ్రెస్ – వామపక్షాల కూటమి తృణమూల్ వ్యతిరేక ఓట్లను చీలుస్తాయని రాజకీయవర్గాల అంచనా. వీటన్నింటినీ పరిశీలిస్తే బెంగాల్ లో ఈసారి త్రిశంకు అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని సీపీఎం సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించడంగమనార్హం.
అసొంలో కమల వికాసానికి అడ్డంకులు
అసొంలో గత ఎన్నికల్లో అసొం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌తో కలిసి మొత్తం126 సీట్లకు గాను 86 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి పరిస్థితులు అంతగా అనుకూలించే అవకాశాలులేవని రాజకీయవర్గాల భావిస్తున్నాయి. కాంగ్రెస్ -అఖిల భారత సమైక్య డెమాక్రటిక్ ఫ్రంట్ (ఏఐయుడీఎఫ్) కమలనాథులకు చుక్కలు చూపించవచ్చునని అంచనా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంవల్లే బీజేపీ గెలిచిందని, కాంగ్రెస్, ఏఐయుడీఎఫ్ కలిస్తే బీజేపీ కంటే ఎక్కువ శాతం ఓట్లు సాధించగలదని రుజువైందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈసారి కలిసి పోటీ చేయడంవల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడం సాధ్యపడుతుందని, అంతేకాక, అసొం జాతీయ పరిషత్, రాయిజోరీ దళ్ అనే రెండు ప్రాంతీయ పార్టీలు కొత్తగా ఏర్పడడంతో అస్సాం గణపరిషత్ కు తీవ్ర నష్టం జరగవచ్చునని అంచనాలున్నాయి.
కేరళ… అందని ద్రాక్షే?
మెట్రో మాన్‌గా పేరొందిన శ్రీధరన్ బీజేపీలో చేరడం వల్ల కేరళలో ఆ పార్టీ అదృష్ట రేఖలు మారే అవకాశాలు లేవని, విద్యాధికుల్లో కొంత సానుకూలత వ్యక్తమయినప్పటికీ అది అసెంబ్లీ సీట్లపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని పార్టీ నేతలు అంటున్నారు. శ్రీధరన్ వల్ల సాంప్రదాయ వామపక్ష ఓటర్లలో కానీ, సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లలో కానీ మార్పు ఉండదని, ఈ ఓటు బ్యాంకును భగ్నం చేయడం అంత సులభం కాదని విశ్లేషకులంటున్నారు. మోదీ ప్రభజంనం వీచిన తర్వాత కూడా కేరళలో కాంగ్రెస్, వామపక్షాలే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచాయి. శబరిమల ఆలయ వివాదం రగులుతున్న సమయంలో కూడా బీజేపీ అభ్యర్థులు మూడో స్థానానికి మించి ఎదగలేకపోయారు. పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన పరిణామాలు, రాష్ట్రపతి పాలన విధించడం బీజేపీకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.
తమిళనాడులో అయోమయం
తమిళనాడులో బీజేపీ పాగా వేయడం అసాధ్యమని అన్నాడిఎంకె- బీజేపీ కూటమిని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని మెజారిటీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ఈసారి డిఎంకే – కాంగ్రెస్ కూటమిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కష్టమని చెబుతున్నారు. హిందీని తీవ్రంగా వ్యతిరేకించే తమిళులు ద్రవిడ పతాకను రెపరెపలాడించే స్టాలిన్ సారథ్య పార్టీకే పట్టం కడతారని అనేక సర్వేలు చెబుతున్నాయి. అధికారం కోసం ఏకమైన అన్నాడీఎంకే లోని రెండు వర్గాల్లో అంతర్గతంగా లుకలుకలు ఉన్నాయని, జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అయోమ యం మరింత ఎక్కువైపోయిందని విశ్లేషకులు అంటున్నారు.
సినీనటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు తిరస్కరించినందువల్ల బీజేపీ శశికళను బయటకు తీసుకు వచ్చిందని, అయితే ఆమె ఎంతమేరకు ప్రభావం చూపగలరన్నది సందేహమే. ప్రధాని మోదీని తమిళనాడు ప్రజలు ఇంకా బయటిశక్తిగానే భావిస్తున్నారని, అన్నాడీఎంకే సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత, డీఎంకే కార్యకర్తల బలం సంఘటితంగా ఉండడం వల్ల బీజేపీ ఆ రాష్ట్రంలో నిలదొక్కుకోవడం కష్టమేనని రాజకీయ వర్గాల అంచనా.