
మున్నెన్నడూ లేనంత ఎక్కువగా సినీ తారలు, ప్రముఖులు ఈ దఫా బెంగాల్ ఎన్నికల బరిలో దిగారు. నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్న రెండు ప్రధాన పార్టీలు- తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వారిని చేర్చుకునేందుకు, టిక్కెట్లిచ్చేందుకు పోటీపడ్డాయి. ముఖ్యంగా బెంగాల్‌లో ఎలాగైనా పాగా వెయ్యాలని తహతహలాడుతున్న బీజేపీ ఈ విషయంలో ముందుంది. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ హీరో మిథున్ చక్రవర్తి చేరిక కమలనాథులకు కొత్త ఊపునిచ్చింది, ఆయన పోటీ చేయకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజాకర్షణ చేయగల సామర్థ్యం ఉన్నందున తగురీతిన వాడుకుంటోంది. ఈయన గతంలో టీఎంసీ ఎంపీ. ఇక టోలీగంజ్ నుంచి బరిలోకి దిగిన వివాదాస్పద ఎంపీ బాబుల్ సుప్రియో టాలీవుడ్ (బెంగాలీ సినీ) గాయకుడు, నటుడు, టీవీ హోస్ట్. ఇప్పటికే అసంసోల్ లోక్‌సభకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టోలీగంజ్‌లో ఆయన రాష్ట్ర మంత్రి, టీఎంసీ బలమైన నేత అరూప్ బిశ్వా్‌సను ఎదుర్కొంటున్నారు. కోల్‌కతాలో టీఎంసీ కంచుకోట అయిన బెహలా తూర్పు స్థానం నుంచి సుప్రసిద్ధ నటి పాయల్ సర్కార్‌ను బీజేపీ దింపింది. ఆమెతో పాటు యశ్ దాస్‌గుప్తా, హిరాన్ చటర్జీ, స్రవంతి ఛటర్జీ మొదలైన తారలను రంగంలోకి దింపింది. తనుశ్రీ చక్రవర్తి, దేవశ్రీ భట్టాచార్య, రాహుల్ చక్రవర్తి మొదలైన తారలూ కాషాయ కండువా కప్పుకుని బరిలో ఉన్నారు. వీరితో పాటు సుమారు 20 మంది టీవీ నటీనటులు కూడా ఆ పార్టీలో చేరారు. ఇక టీఎంసీ నుంచి ప్రముఖ నటి సయోని ఘోష్ ఉత్తర 24 పరగణాల నుంచి రంగంలో ఉన్నారు. ఈమెతో పాటు కౌశాని ముఖర్జీ, కాంచన్ మల్లిక్, జూన్ మాలియా, సయంతికా బెనర్జీ, దర్శకుడు రాజ్ చక్రవర్తి, గాయకులు అదితి మున్షీ, బీర్‌బా హండ్సా టీఎంసీ తరఫున పోటీలో ఉన్నారు. సినీతారలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్లిచ్చే సంప్రదాయాన్ని బెంగాల్‌లో మొదలెట్టినది దీదీయే! లెఫ్ట్ ప్రంట్ సర్కార్‌ను దింపేయడానికి ఆమె ఎన్నుకున్న మార్గాల్లో ఇది ఒకటి. వీటి ద్వారా ఆమె లక్షించినవి రెండు. తారలకున్న ప్రజాకర్షణను రాష్ట్రమంతా సొమ్ము చేసుకోవడం, నియోజకవర్గాల్లో తలెత్తే ఫ్యాక్షనిజానికి చెక్ పెట్టడం. ఈ వ్యూహంలో ఆమె సఫలమయ్యారు. గతంలో మూన్‌మూన్ సేన్, శతాబ్ది రాయ్, తపస్ పాల్, సంధ్యా రాయ్, నస్రత్ జహాన్, మియామీ చక్రవర్తి, దేవశ్రీ రాయ్, చిరంజీత్ చక్రవర్తి… మొదలైన వారిని నిలబెట్టి అసెంబ్లీకో, పార్లమెంట్‌కో ఎన్నికయేట్లు చేశారు. కొన్ని సందర్భాల్లో ఇది ఫలించలేదు కూడా! 2014లో బప్పీ లహరి, నిము భౌమిక్, జోయ్ బెనర్జీ, సోహమ్ చక్రవర్తి మొదలైనవారికి టిక్కెట్లిచ్చినా ఫలితం లేకపోయింది. ఇపుడు బీజేపీ అదే మార్గాన్ని అనుసరిస్తోంది. మరి గెలిచే తారలెవరో… ఓడేదెవరో!!