‘అబ్ కీ బార్, ట్రంప్ సర్కార్‘ (ఈసారి అధికారంలోకి ట్రంప్ ప్రభుత్వమే) అంటూ అమెరికా హ్యూస్టన్ సభలో నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా ఆదేశ కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌తో సంభాషించారు. అధ్యక్షుడిగా ఘన విజయం సాధించినందుకు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపినట్టు మోదీ ట్వీట్ కూడా చేశారు. వాతావరణ మార్పుల అంశంలో రెండు దేశాలు కలిసిపనిచేసేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రాంతీయ అంశాలూ చర్చకు వచ్చాయన్నారు. ఇద్దరు నేతల ఫోన్ సంభాషణకు సంబంధించి వైట్‌హౌస్ అధికారిక ప్రకటన విడుదలచేసింది. ఉగ్రవాదంపై, కరోనాపై చేస్తున్న పోరాటంలో విజయం సాధించేందుకు రెండు దేశాలు కలిసి పనిచేయనున్నట్టు ప్రకటించారు. ఇద్దరు నేతల మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ‘క్వాడ్’ సహకారంతో ప్రాంతీయ దేశాల సమగ్రత, స్వేచ్ఛాయుత నౌకాయాన విధానం మెరుగయ్యేందుకు వీలుగా ఇండో-పసిఫిక్ దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని అంగీకరించారు. (భారత్, అస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాలను కలిపి క్వాడ్ దేశాలని అంటారు). మయన్మార్‌లో చట్టబద్ధపాలన, ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణ జరగాలని ఆకాంక్షించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బైడెన్ 9 మంది విదేశీ నేతలతోనే మాట్లాడారు. కాగా, అఫ్ఘానిస్థాన్‌లో పెరుగుతున్న విధ్వంసంపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. తీవ్రవాదం, ఉగ్రవాదానికి స్వస్తి పలికి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా చర్యలు మొదలుపెట్టాలని ఆ దేశాన్ని కోరారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో మోదీ మంగళవారం ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు.
