ముంబై, అహ్మదాబాద్, ఫిబ్రవరి 15: ఓ దశలో దేశంలో కరోనా కేంద్రస్థానంగా నిలిచి.. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తున్న మహారాష్ట్రలో ఒక్కసారిగా పాజిటివ్‌లు పెరిగాయి. ఆదివారం ఆ రాష్ట్రంలో 4,092 మందికి వైరస్ నిర్ధారణ అయింది. జనవరి 6 తర్వాత అక్కడ నమోదైన అత్యధిక కేసులివే. కొత్త కేసుల్లో ముంబై డివిజన్‌లోనే 1,100 పైగా నమోదయ్యాయి. కొత్తగా 40 మంది చనిపోయారు. కేరళలో ఆరువేలపైగా పాజిటివ్‌లు వస్తున్నా మరణాలు 20లోపే ఉంటున్నాయి. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (64) కరోనా బారినపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వడోదర సభలో ఆదివారం అస్వస్థతకు గురైన ఆయనను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా.. వైరస్ సోకినట్లు తేలింది. దేశంలో ఆదివారం 11,649 మందికి పాజిటివ్ వచ్చింది. 90 మంది చనిపోయారు. 9,489 మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసులు 1.39 లక్షలకు తగ్గాయి.

50 ఏళ్లు పైబడినవారికి వచ్చే రెండు, మూడు వారాల్లో టీకా పంపిణీ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 18, 19 టీకాలు ప్రి క్లినికల్, క్లినికల్, అడ్వాన్స్ వంటి వివిధ ప్రయోగ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. 20-25 దేశాలకు భారత్ టీకా సరఫరా చేస్తోందన్నారు. వారం రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని, 21 జిల్లాల్లో 21 రోజులుగా పాజిటివ్‌లు లేవని హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
రెడ్ లిస్ట్‌లో 33 దేశాలు..
కరోనా కొత్త స్ట్రెయిన్‌తో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే).. ప్రయాణ ఆంక్షలను కఠినం చేసింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. హైరిస్క్ (రెడ్ లిస్ట్) జాబితాలో పేర్కొన్న 33 దేశాల నుంచి వచ్చినవారికి పదిరోజుల హోటల్ క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను ఖాతరు చేయనివారిపై జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. యూకే రెడ్ లిస్ట్‌లో భారత్ లేదు. అయితే, మనదేశం నుంచి వెళ్లినవారు తప్పకుండా పది రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలి.
ఇన్ఫెక్షన్ ఉన్నా.. ‘నెగెటివ్’ రిపోర్టులు పిల్లల్లోనే ఎక్కువ
20 ఏళ్లకు పైబడిన వారితో పోలిస్తే.. అంతకంటే తక్కువ వయస్కులైన పిల్లలు, యువతకు కరోనా సోకే ముప్పు 43 శాతం తక్కువని ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇరవై ఏళ్లకు పైబడిన వారిలో అత్యధికంగా 63 శాతం మందికి ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ.. వైద్య పరీక్షల్లో ‘నెగెటివ్’ రిపోర్టు వస్తున్న వారిలో యువత కంటే పిల్లలే ఎక్కువగా ఉన్నారన్నారు. అద్దాలు, ప్లాస్టిక్‌లపైనే కరోనా వైరస్ ఎక్కువ సమయం జీవిస్తుందని బాంబే ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్లాస్‌పై 4 రోజులు, ప్లాస్టిక్‌పై వారం రోజుల పాటు వైరస్ ఉంటుందన్నారు. కాగితంపై మూడు గంటలు, వస్త్రంపై రెండు రోజులే ఉంటుందన్నారు.