ఇటీవలే బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. బీజేపీ మంగళవారం విడుదల చేసిన తమ అభ్యర్థుల తుది జాబితాలో మిథున్‌కు చోటు కల్పించలేదు. ఇప్పటిదాకా విడుదల చేసిన జాబితాల్లో రాస్‌బిహారీ స్థానాన్ని ఖాళీగా ఉంచడంతో మిథున్ చక్రవర్తి కోసమే దానిని ఖాళీగా ఉంచారేమోనని భావించారు. కానీ, తాజా జాబితాలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాను ఆ నియోజకవర్గానికి అభ్యర్థిగా బీజేపీ పేర్కొంది. దీంతో ఒకప్పటి ‘డిస్కో డ్యాన్సర్’ ఇక ఈ ఎన్నికల్లో ప్రచారానికే పరిమితం కానున్నారు. కాగా.. అధికార తృణమూల్ తరఫున పోటీ చేస్తున్న ప్రముఖ సినీనటి సయోనీ ఘోష్‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం తాను పోటీ చేస్తున్న నియోజకవర్గానికి సయోని వెళ్లగా.. పార్టీ కార్యకర్తలు ఆమెకు దగ్గరగా దూసుకువచ్చి తాకేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు సయోనీ దూరంగా పరుగెత్తగా.. వారూ ఆమెను వెంబడించారు. దీంతో ఆమె భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
