ఫిబ్రవరి 2: ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే కొన్ని ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉండటం అరుదు.

ఈ ఫొటో అలాంటిదే. మయన్మార్‌లో ఎన్‌ఎల్డీ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ సహా కీలక నేతలను సోమవారం అక్కడి సైన్యం గృహ నిర్బంధం చేసి అధికారాన్ని తమ వశం చేసుకుంది కదా. ఈ పరిణామానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఓ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ రోజు అధికార మార్పిడికి కొన్ని నిమిషాల ముందు పార్లమెంట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు సైన్యం తాలూకు కాన్వాయి ఆ వైపు వెళ్లింది. అదే సమయంలో ఖింగ్ హినిన్ వాయ్ అనే ఓ ఏరోబిక్ శిక్షకురాలు తనను తాను మైమరచిపోయి ఏరోబిక్స్ చేస్తోంది.
ఆ సమయంలో ఆమె వెనుక నుంచే సైన్యం కాన్వాయి పార్లమెంటు వైపు దూసుకెళుతోంది. దీన్ని ఆమె గమనించనే లేదు. ఈ వీడియోను మంగళవారం ఆమె ఓ సామాజిక మధ్యమంలో పోస్ట్ చేయగా దాదాపు 1.3 కోట్ల మంది వీక్షించారు. 65 వేల మందికిపైగా షేర్ చేశారు. 1.9 లక్షల మంది లైక్ కొట్టారు. కాగా తాను పార్లమెంటు ఎదుట గత 11 నెలలుగా ఏరోబిక్స్ చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నానని చెబుతూ ఖింగ్ హినిన్ వాయ్ ఆ పాత వీడియోలను కూడా పోస్ట్ చేశారు.