బెంగళూరు : భారత దేశం రక్షణ కోసం విదేశాలపై ఆధారపడజాలదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

మంగళవారం ఆయన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రెండో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) ప్రొడక్షన్ లైన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రక్షణ అవసరాలకోసం విదేశాలపై ఆదారపడలేమని చెప్పారు.
హెచ్ఏఎల్‌కు కొత్త ఆర్డర్స్ వచ్చే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వేధిస్తున్నప్పటికీ, రూ.48 వేల కోట్ల విలువైన ఆర్డర్లను సాయుధ దళాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఇది స్వదేశీ రక్షణ సేకరణలో అతి పెద్దదని తెలిపారు. దీంతో భారత దేశ ఏరోస్పేస్ రంగం నూతన శిఖరాలను అధిరోహిస్తుందన్నారు. మన దేశంలో తయారవుతున్న తేజస్ ఎం1ఏ యుద్ధ విమానాల పట్ల చాలా దేశాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే హెచ్ఏఎల్‌కు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తాయని హామీ ఇచ్చారు.
రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, బెంగళూరులో హెచ్ఏఎల్‌కు చెందిన కొత్త ఎల్‌సీఏ-తేజస్ ప్రొడక్షన్ లైన్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమంలో భాగంగా మన దేశం రక్షణ పరికరాల తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టిపెట్టిందని చెప్పారు. భారత దేశం తన రక్షణ కోసం ఇతర దేశాలపై ఆధారపడజాలదన్నారు.
తేజస్ స్వదేశంలో తయారైనది మాత్రమే కాకుండా, దీనికి సమానమైన విదేశీ యుద్ధ విమానాల కన్నా మెరుగైనదని పేర్కొన్నారు. ఇంజిన్ సామర్థ్యం, రాడార్ సిస్టమ్, బియాండ్ విజువల్ రేంజ్ (మిసైల్), ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకోవడం, మెయింటెనెన్స్ వంటి అంశాల్లో తేజస్ ఉత్తమమైనదన్నారు. అంతేకాకుండా దీని ధర కూడా తక్కువేనని చెప్పారు.
బెంగళూరులోని యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఈ నెల 3 నుంచి 5 వరకు ఏరో ఇండియా షో జరుగుతుంది. ఈ షోలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు.