వైర‌ల్ స్టోరీః ప్ర‌భుత్వ సంస్థ‌ల అమ్మ‌కాల‌పై ఆలోచ‌న రేకెత్తిస్తున్న సామ‌న్యుడి ప్ర‌శ్న ఇదిగో!‌

0
274
Spread the love

”దేశానికి గుదిబండలుగా తయారైన ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే వదిలించుకోకపోతే ప్రజల సంక్షేమానికి అవసరమైన నిధులను సమకూర్చుకోలేం. ప్రజల కోసమే నా జీవితం అంకితం. అందుకే ఎవరెన్ని విధాలుగా నన్ను విమర్శించినా నేను లక్ష్యపెట్టను. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే తీరుతాను” ఇదీ ప్రధాని మోడీ అభిప్రాయం. నీతి ఆయోగ్‌ సమావేశంలో ఇటీవల ఆయన ఈ విధంగానే కుండ బద్దలుగొట్టాడు.

మోడీ గారికన్నా ఈ దేశానికి ఏది మేలు చేస్తుందో, ఏది హాని చేస్తుందో తెలిసిన మొనగాడు లేడు అని బాగా బలంగా నమ్ముతూ, అదే విషయాన్ని ప్రజానీకం యావన్మందీ నమ్మి తీరాలని వాదించేవారు, విపరీతంగా ప్రచారం చేస్తున్నవారు ఉన్నారు. వారు చెప్పినదానిని అంగీకరించని వారంతా దేశద్రోహులని కూడా ముద్ర వేస్తున్నారు.

ఇక్కడ దేశద్రోహులన్న ముద్ర వేయించుకోడానికి ఉత్సాహపడుతున్న వారెవరూలేరు.అయితే మోడీ గారి ప్రకటన తర్వాత సహజంగానే నావంటి అతి సాధారణ వ్యక్తికి వస్తూన్న అత్యంత సాధారణ సందేహాలు ఇవి.

1.గుదిబండలు అంటే మనం మోయలేని భారం అని అర్ధం. ఇప్పుడు మొదటి ప్రశ్న-మోడీ అమ్మదలచుకున్న ప్రభుత్వ రంగ సంస్థలలో గుదిబండలు ఏవి? పేర్లు చెప్పగలరా?

  1. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఎల్‌ఐసి నేడు ప్రతీ ఏటా వేల కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్‌ గా అందిస్తోంది. మోడీ గారికి ఈ డివిడెండ్‌ అందుకోవడం మోయలేని భారంగా అనిపిస్తోందా? ఆనాటి రూ.5 కోట్ల పెట్టుబడి కాస్తా నేడు దాదాపు రూ.40 లక్షల కోట్ల ఆస్తిగా పెరిగింది. ఈ పెరుగుదల మోడీ గారికి దుర్భరంగా ఉందా? ఎందువలన ఎల్‌ఐసి లోని వాటాలను మోడీ అమ్మదలుచుకున్నారు?
  2. ప్రతీ ఏడూ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టినప్పుడు అందులో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వస్తున్న ఆదాయాన్ని చూపిస్తారు. దానిని ఆదాయం అంటామా లేక మోయలేని భారం అనుకుంటామా? ఈ ఆదాయం కాకుండా ఆ సంస్థలు వివిధ రూపాల్లో పన్నులు కూడా కడతాయి. ఆ పన్నుల ఆదాయాన్ని మోయలేని భారం అంటామా లేక ప్రయోజనం అంటామా?
  3. విశాఖ ఉక్కును ఏకంగా అమ్మేస్తామని పట్టుబట్టి ఇంటర్‌ మినిస్టీరియల్‌ గ్రూపును కూడా ఏర్పాటు చేశారు. ఆ విశాఖ ఉక్కు కోసం కేంద్రం పెట్టిన పెట్టుబడి రూ.5000 కోట్లు.దానిమీద ఇంతవరకూ కేంద్రానికి వచ్చిన రాబడి డివిడెండ్‌ రూపంలో గాని, పన్నుల రూపంలో గాని చూసుకుంటే అది రూ.46,753 కోట్లు.పెట్టిన పెట్టుబడి కన్నా ఇన్ని రెట్లు అదనంగా ఆదాయం తెచ్చిపెట్టిన విశాఖ ఉక్కు గుదిబండ ఎలా అయింది?
  4. విశాఖ ఉక్కుకి ఉన్న భూముల విలువ నేటి మార్కెట్‌ ప్రకారం లక్ష కోట్లకు పైమాటే.దానికి తోడు అక్కడ నెలకొల్పిన కర్మాగారం, టౌన్‌షిప్‌, హాస్పిటల్‌ వగైరా అన్నీ కలిపితే వాటి మార్కెట్‌ విలువ మరో లక్ష కోట్లు కనీసం ఉంటుంది.దీనిని ఎంత విలువకి అమ్మజూపుతున్నారు?
    కేవలం రూ.4889 కోట్లకి. నిజానికి అంత కూడా అవసరం లేదు. రూ.2,500 కోట్లు చెల్లించి 51 శాతం వాటాలను కొంటే చాలు. లక్షల కోట్ల విలువ చేసే ప్లాంటును చేజిక్కించుకోవచ్చు.ప్రజా ధనంతో నిర్మించిన, లక్షల కోట్ల విలువ చేస్తున్న ఉక్కు ఫ్యాక్టరీని ఇంత తక్కువకే అమ్మితే దానిని ప్రజా సంక్షేమం అంటారా? లేక కార్పొరేట్‌ల నిలువుదోపిడీ అంటారా?
  5. ప్రభుత్వానికే గుదిబండగా తయారైన ప్రభుత్వ రంగ పరిశ్రమను ఏ ప్రైవేటు వాడైనా ఎందుకు కొంటాడు?ప్రైవేటువాడు కొని అదనపు కార్మికులను తొలగించి, ఉన్న కార్మికుల జీతాలను తగ్గించి పరిశ్రమను మరింత లాభసాటిగా చేస్తాడు అని కొందరు కార్పొరేట్‌ భజనగాళ్ళు చెప్తారు.ఇలా కార్మికుల జీతాలను తగ్గించడం సరైన చర్య అని అనుకోవాలా?ఉన్న ఉద్యోగాలను తగ్గించడం, ఉన్న జీతాలను తగ్గించడం సంక్షేమం అవుతుందా?
  6. ప్రైవేటు సంస్థల్లో జీతాలు తక్కువ గనుక ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని కార్పొరేట్‌ భజనగాళ్ళు (కా.భ.గాళ్ళు) అంటారు. ఇప్పటివరకూ ప్రభుత్వం అమ్మేసిన సంస్థలలో ఆ విధంగా ఎక్కడైనా అదనంగా ఉద్యోగాలు పెరిగాయా? ఎన్ని పెరిగాయి?
  7. అంతవరకూ లాభాల బాటలో నడుస్తూ వుండిన హిందూస్తాన్‌ జింక్‌ ను (విశాఖ) వేదాంత కంపెనీ కొనుక్కుంది. అందులో వర్కర్లను తొలగించారు. ఆ కంపెనీని మూసివేశారు. ఇదేనా మోడీ మార్కు సంక్షేమం?ఇదంతా కాంగ్రెస్‌ హయాంలో జరిగింది గనక మాకేమీ సంబంధం లేదని కా.భ.గాళ్ళు అంటారు. మరి కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అన్యాయాలను, తప్పులను సరిదిద్దుతామని అంటేనే కదా మోడీని గెలిపించింది? ఇప్పుడు మోడీ ఆ హిందూస్తాన్‌ జింక్‌ కంపెనీని తిరిగి తెరిపించి కాంగ్రెస్‌ చేసిన దుర్మార్గాన్ని సరిదిద్దగలడా? కార్మికులను తిరిగి పనుల్లో పెట్టగలడా?

  1. ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్షల కోట్ల మేరకు ప్రైవేటు కంపెనీలు బకాయిలు పడ్డాయి. అంటే ఆ ప్రైవేటు కంపెనీలన్నీ గుదిబండలు అయ్యాయి. మరి ఆ గుదిబండలను వదిలించుకోవాలి కదా? ఆ కంపెనీలను స్థాపించిన పెద్దమనుషులకు మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టడానికి అనుమతులను నిరాకరించాలి కదా? ఎక్కడైనా మోడీ ప్రభుత్వం ఆ పని చేసిందా?
  2. ప్రైవేట్‌ సంస్థల పారు బకాయిలను లక్షల కోట్ల మేరకు మాఫీ చేయడం వలన నష్టపోతున్నది అప్పులిచ్చిన బ్యాంకులు. అందులో డబ్బు దాచుకున్నది సామాన్య ప్రజలు. ఇలా ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడమేనా ప్రజా సంక్షేమం?
  3. సామాన్యులెవరైనా బ్యాంకులకు బకాయి పడితే వారి ఆస్తులను జప్తు చేస్తారు. మరి కార్పొరేట్లు బకాయి పడితే జప్తు ఎందుకు చేయరు? జప్తు చేయమని మోడీ ప్రభుత్వం ఎన్నడైనా ఆదేశించిందా? జప్తు చేయకపోగా ఆ కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నప్పుడు ఈ సామాన్యులకు కూడా ఎందుకు మాఫీ చేయరు?
  4. కార్పొరేట్‌ పన్నును మోడీ గారు 2019లో 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. దానివలన ప్రభుత్వానికి రావలసిన పన్ను ఆదాయంలో ఏడాదికి రూ. 1,50,000 కోట్లు తగ్గింది. కార్పొరేట్లకు అంత రాయితీ ఇవ్వగలిగినప్పుడు విశాఖ ఉక్కుకు మొత్తం పన్ను కట్టనవసరం లేకుండా మాఫీ చేయవచ్చు కదా?అలా కాకపోతే, కార్పొరేట్‌ కంపెనీల పారు బకాయిలను మాఫీ చేసినట్టు విశాఖ ఉక్కు బకాయిలను కూడా మాఫీ చేయవచ్చు కదా?

ఇవేమీ చేయకుండా మొత్తం ప్లాంట్‌ను అమ్మేయడం ఎందుకు? ఎవరి సంక్షేమం కోసం?

ఈ సందేహాలు తీర్చి మమ్మల్ని విజ్ఞానవంతుల్ని చేయగలవారెవ్వరు?

ఇట్లు,
ఓ సామాన్యుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here