శరవేగంగా వ్యాక్సినేషన్‌.. భారత్‌ రికార్డు

0
168
Spread the love

ఫిబ్రవరి 3 : ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న భారత్‌ మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది.తొలి 40 లక్షల మందికి 18 రోజుల్లోనే టీకా వేశామని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో బుధవారం నుంచి కొవాగ్జిన్‌ టీకా వాడకం ప్రారంభమైంది. కోల్‌కతాలోని మూడు వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 60 మంది ఆరోగ్య కార్యకర్తలకు ఈ టీకాను వేశారు.

జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రి ‘మేదాంత’లో సోమవారం కరోనా టీకా వేయించుకున్న ఆరోగ్య కార్యకర్త మన్నూ పాహన్‌(52).. మంగళవారం రాత్రి మృతిచెందాడు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే మరణానికి గల కారణం తెలుస్తుందని ఆస్పత్రి సీఈవో డాక్టర్‌ పంకజ్‌ సాహ్ని వెల్లడించారు. మరోవైపు దేశంలో క్రియాశీల (యాక్టివ్‌) కరోనా కేసుల సంఖ్య 1.5 శాతం తగ్గి 1.60 లక్షలకు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 11,039 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1.07 కోట్లు దాటింది. మొత్తం మరణాలు 1.54 లక్షలు దాటాయి.

కాగా దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకి ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన 135 కోట్ల దేశ జనాభాలో 30 కోట్ల మందికిపైగా ఇప్పటికే వైరస్‌ బారినపడి ఉండొచ్చని తెలిపాయి. కాగా ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ వ్యాక్సిన్‌ మొదటి డోసుతో కొవిడ్‌-19 వ్యాప్తిరేటు దాదాపు 67 శాతం తగ్గుతుందని ఆ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అలాగే చైనాలోని వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీని డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం సందర్శించింది. వారివెంట కొంతమంది మీడియా ప్రతినిధులను ల్యాబ్‌లోకి అనుమతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here