ముంబై : బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించి మరో కొత్త కోణం వెలుగుచూసింది. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో నటి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియా హస్తం ఉందన్న కోణంలో కేసును విచారిస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఇవాళ విచారించింది. ఎన్‌సీబీ విచారణకు హాజరైన ఆమె కొన్ని నిజాలు ఒప్పుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.
సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రియా చక్రవర్తి అంగీకరించింది. షోవిక్, మిరాండాల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రియా ఎన్‌సీబీ అధికారులు ముందు చెప్పింది. తన సోదరుడి ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నానని రియా వెల్లడించింది. సుమారు 6 గంటలపాటు రియాను ఎన్‌సీబీ అధికారులు విచారించారు. అంతేకాదు.. రేపు కూడా రియాచక్రవర్తిని మరోసారి ఎన్‌సీబీ విచారించనున్నది. సోమవారం నాడు మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనంతరం రియాను కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఇప్పటికే డ్రగ్స్ మాఫియాతో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తికి సంబంధాలున్నట్టు తేలడంతో ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.
అరెస్ట్‌కు రియా సిద్ధం!
ఇదిలా ఉంటే.. ఇవాళ విచారణకు వెళ్లే ముందు రియా తరపు న్యాయవాది సతీష్ మనీ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. రియా అరెస్ట్‌కు సిద్ధంగా ఉందని చెప్పారు. ఒకరిని ప్రేమించడం నేరమైతే.. ప్రేమించినందుకు ఆమె ఆ పరిణామాలు ఎదుర్కోవడానికి వెనకడుగు వేసే పరిస్థితిలో లేదన్నారు. రియా అమాయకురాలని, అందుకే సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ కేసులు ఆమెపై నమోదైనప్పటికీ ఏ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని ఆమె తరపు న్యాయవాది సతీష్ మనీ షిండే చెప్పుకొచ్చారు.
