న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: దాదాపు 70 రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళన అనూహ్య రీతిలో సామాజిక యుద్ధానికి తెరలేపింది.

ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ సెలబ్రిటీల ట్వీట్లతో ఆందోళన ప్రపంచ వేదికలపైకి ఎగబాకింది. పాప్ స్టార్ రిహానా ట్వీట్‌తో మొదలైన ఈ సోషల్ మీడియా విమర్శల దాడి… పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, పోర్న్ స్టార్ మియా ఖలీఫా, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జిమ్ కోస్టా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోదరి కుమార్తె మీనా హారిస్… మొదలైన వారితో మరింత వేడెక్కింది.
తొలిసారిగా ఇంటా బయటా విమర్శల హోరు సాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడి ఎదురుదాడి మొదలెట్టింది. విదేశాంగ శాఖ మాత్రమే కాక ఏడుగురు అగ్రశ్రేణి మంత్రులు అమిత్ షా, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, కిరణ్ రిజిజు, రామ్‌దాస్ అధవలే, హర్‌దీప్ పురి, వీకే సింగ్ సెలబ్రిటీలపై ప్రతి దాడిచేస్తూ ట్వీట్లు పెట్టారు. ఓ రకంగా మున్నెన్నడూ లేని స్థాయిలో సామాజిక మాధ్యమంగా వేలకొద్దీ అనుకూల, ప్రతికూల పోస్టులతో ట్విటర్ హోరెత్తిపోతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న ఆందోళనకు సంబంధించి కేంద్రం 257 యూఆర్‌ఎల్‌లను, ఒక హ్యాష్‌ట్యాగ్‌ను స్తంభింపజేయాల్సిందిగా సామాజిక మాధ్యమం ట్విటర్‌ను సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.
కిసాన్ ఏక్తా మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్), అనేక రైతుయూనియన్లు, ప్రజా హక్కుల కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ, సీపీఎంల నేతలు, కారవాన్ మేగజైన్, ప్రసార్ భారతి సీఈవో వెంపటి శశి శేఖర్… మొదలైన సంస్థల, వ్యక్తుల ఖాతాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాలను వెంటనే అమలు పరిచినా 24 గంటల లోపే వీటిని ట్విటర్ పునరుద్ధరించింది. ఆదేశాలను కొనసాగించలేమని స్పష్టం చేస్తూ సమాధానం పంపింది. దీంతో కేంద్రం భగ్గుమంది.
ముఖ్యంగా- ‘మోదీ ప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌పై తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ- ఖాతాలను, హ్యాష్‌ట్యాగ్‌లను వెంటనే తొలగిస్తారా లేక చర్య తీసుకోమంటారా అని తీవ్ర హెచ్చరిక చేస్తూ ట్విటర్‌కు ఓ 18- పేజీల నోటీసును సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పంపింది. ఐటీ శాఖ అధికారులతో సోమవారం రాత్రి చర్చలు జరగకముందే వీటిని అన్‌బ్లాక్ చేశారని, అసలు పునరుద్ధరించడానికి తాము అనుమతి ఇవ్వనే లేదని కేంద్రం అంటోంది.
‘‘మీరు (ట్విటర్) ఓ మధ్యవర్తి మాత్రమే.. ఓ న్యాయస్థానంలా బాధ్యత తలకెత్తుకోజాలదు. సుప్రీంకోర్టు వెలువరించిన అనేకానేక తీర్పుల బట్టి కూడా ప్రజా భద్రత నిమిత్తం అవసరమైన చర్యలు తీసుకొనే అధికారం మాకుంది’’ అని ఐటీ శాఖ ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వం చెప్పిన ట్వీట్లు స్వేచ్ఛా వాణిని ప్రతిబించాయని అందుకే అన్‌బ్లాక్ చేశామని ట్విటర్ వివరించింది.
సోషల్… గ్లోబల్
ఓ పక్క భారత ప్రభుత్వం ట్విటర్‌తో చట్టబద్ధంగా సంవాదం సాగిస్తున్న సమయంలో రైతులకు మద్దతుగా అంతర్జాతీయ ప్రముఖులు వరుసగా ట్వీట్లు చేయడం మొదలెట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ నిలిపివేతపై సీఎన్‌ఎన్‌లో వచ్చిన ఓ వ్యాసాన్ని షేర్ చేస్తూ- ‘మనమెందుకు రైతుల ఆందోళన గురించి మాట్లాడకూడదు?’ అని ప్రఖ్యాత పాప్ సింగర్ రిహానా ట్వీట్ చేయడం సంచలనం రేపింది. ఈ ట్వీట్‌ను సమర్థిస్తూ స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ – ఢిల్లీ రైతాంగ పోరాటానికి తన మద్దతు తెలియజేస్తున్నట్లు పోస్టు పెట్టారు. అయితే భారత ప్రభుత్వం నుంచి వివరణ వచ్చాక ఆమె తన పోస్టును డిలీట్ చేశారు.
సెలబ్రిటీల ట్వీట్లు వైరల్ కావడంతో కేంద్రం ఇబ్బందుల్లో పడింది. ‘‘సంచలనాత్మకమైన హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడం సరికాదు. దేశం ఎంతో ఘనంగా జరపాల్సిన రిపబ్లిక్ దినోత్సవం రోజున హింసకు తెగబడి జాతి ఔన్నత్యాన్ని దెబ్బతీశారు. కొన్ని స్వార్థపరశక్తులు చొరబడి వీటిని రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులే గాంధీ విగ్రహాన్ని (అమెరికాలో) ధ్వంసం చేశాయి. రైతు ఆందోళనపై మేం సంయమనంతో వ్యవహరిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ వివరించింది. విదేశాంగ శాఖ ప్రకటన వెలువడ్డ కొంతసేపటికి కేంద్రం మిగిలిన బలగాన్ని కూడా రంగంలోకి దించింది.
‘‘ఇండియా టుగెదర్’’, ‘‘ఇండియా ఎగెన్‌స్ట్ ప్రొపగాండా’’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఏడుగురు మంత్రులు, బీజేపీ ప్రముఖులు, ఇతరులు ట్వీట్ల దాడి మొదలెట్టారు. ‘ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా భారత ఐక్యతను దెబ్బతీయలేరు.. భారత్ అత్యున్నత స్థాయికి చేరకుండా ఆపలేరు.. దేశ భవితను ఈ ప్రతికూల ప్రచారాలు నిర్దేశించలేవు’ అని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
మరో పక్కకేంద్ర ప్రభుత్వ వాదనకు దన్నుగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ తారలు కంగన రనౌత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, కరణ్ జోహార్, సునీల్ శెట్టి మొదలైనవారు ట్వీట్లు చేశారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులు ఉగ్రవాదులని కంగన్ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది.
రాజకీయ యుద్ధం
అంతర్జాతీయ ప్రముఖులు ట్వీట్లు చేయడం చూస్తే భారత్ పరువు మంటగలిసిందని, దీనికి ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీల మైండ్ సెట్ కారణమని, ప్రధాని మోదీ బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీనిని బీజేపీ తిప్పికొట్టింది.
రాహుల్ విదేశీ పర్యటనలు చేస్తూ అక్కడ భారత వ్యతిరేక శక్తులను కూడగట్టి ఈ దుష్ప్రచారాలు చేయిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి సంబిట్ పాత్రా దుయ్యబట్టారు.