స్వర్గాన్ని ఇలకు దింపడమే తరువాయి… అన్ని వర్గాలకూ అన్నీ ప్రకటించేశారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్! పెట్రోధరల తగ్గింపు నుంచీ స్కాలర్‌షిప్పుల వరకూ హామీల వర్షం దంచేశారు. వీటిలో తమిళ ఓటర్లు గమనించిన ఒక కీలకమైన హామీ ఏంటంటే….. రాష్ట్రంలో ఆలయాల ఉద్ధతికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం. అంతేకాక- పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి రూ 25,000 నుంచి లక్ష రూపాయల దాకా ఆర్థికసాయం. వీటితో పాటు హిందూ ఓటర్లను ఆకట్టుకునే మరికొన్ని తాయిలాలు కూడా ప్రకటించారు. అనేకమందిని విస్మయపరిచిన హామీలివి. ఎందుకంటే ద్రవిడ ఉద్యమమే ఆలంబనగా రాజకీయంగా వేళ్లూనుకున్న పార్టీ డీఎంకే ఎక్కువగా నాస్తికవాద సిద్ధాంతాలను అనుసరిస్తూ వచ్చింది. ద్రవిడ ఉద్యమ పిలామహుడు పెరియార్ రామస్వామికి నిజమైన వారసుణ్ణని తనను తాను అభివర్ణించుకున్న కరుణానిధి.. మతాతీతంగా, లౌకికంగా తమ వైఖరి ఉంటుందని అనేకమార్లు పేర్కొన్న సంగతి అందరికీ తెలుసు. ఏ ఎన్నికల్లోనూ ఆయన హిందూ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయలేదు.

జీవిత కాలంలో ఒక్క ఆలయాన్నీ సందర్శించలేదు, ఒకే ఒకసారి వేరే అంశానికి సంబంధించి పుట్టపర్తి సాయిబాబాతో వేదిక పంచుకున్నారంతే! ఇపుడు ఆయన రాజకీయ వారసుడు స్టాలిన్ తద్భిన్నమైన మార్గాన్ని ఎంచుకోడానికి కారణాలేంటి? ఇది ఉదారవాద హిందూత్వం కాదుగానీ కొంతవరకూ హిందూ వర్గాలను కూడా మంచి చేసుకోడానికే అన్న విమర్శలు వచ్చాయి. తమిళనాడులో దాదాపు 43,000 ఆలయాలున్నాయి. కొన్ని జీర్ణావస్థలో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడమే కాక, లక్షల ఎకరాల ఆలయ భూముల పరిరక్షణ కూడా స్టాలిన్ ఎజెండాలో ఉన్నాయి. అన్నాడీఎంకేతో చెలిమి తరువాత బీజేపీ హిందూ వర్గాలను సంఘటితం చేయడానికి ప్రయత్నిస్తోందని స్టాలిన్ అర్థం చేసుకున్నారు. దీనిని కౌంటర్ చేయక తప్పదని ఆయన భావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే-అనుకూల గాలి వీస్తోంది. ఈ దశలో హిందూ-వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడం అవసరమని స్టాలిన్ నిర్ణయించుకొన్నారు. తమిళ ఓటర్లలో ఎక్కువమంది దైవభక్తి పరులున్నారు. డీఎంకే ఆలయ-వ్యతిరేకి అన్న అపప్రధను తొలగించుకోవడం తప్పదని నిశ్చయించుకున్నారు.
వీటితో పాటు మిగిలిన అన్ని ద్రవిడ పార్టీలు- అన్నాడీఎంకే, పాటాలి మక్కల్ కచ్చి, విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే, కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం), వైకో నేతృత్వంలోని మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే)… మొదలైనవి ఈ హేతువాద సిద్ధాంతాలను అనుసరించడం లేదు. మిగిలిన పార్టీల నేతలందరూ నామినేషన్ దాఖలు సమయంలోనూ, ప్రచార సందర్భంలోనూ ఆలయాలు సందర్శిస్తున్నారు. అన్నాడీఎంకే, బీజేపీ అయితే సరేసరి… ఇలాంటపుడు మనమొక్కరమూ మడికట్టుక్కూర్చోవడమెందుకు..? అన్న అభిప్రాయం చాలా మంది డీఎంకే నేతల్లో ఉంది. హిందూ ఓట్లను చీల్చడానికి ప్రయత్నించే పార్టీలు పుట్టుకొచ్చినపుడు- ఆ వర్గానికి దన్నుగా నిలబడడం సానుకూల సంకేతలను పంపుతుందని స్టాలిన్ కూడా భావించినట్లు విశ్లేషకులంటున్నారు. బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ ఎజెండా వల్ల మతపరంగా కొన్ని ఓట్లు దూరమైనా ఇబ్బందేనని, అందువల్లే ఈ వైఖరని వినిపిస్తోంది. అయితే డీఎంకే ప్రకటించిన ఈ ‘హిందూ తాయిలాలు’ పెద్ద జోక్ అనీ, ఓటర్లెవరూ నమ్మరని బీజేపీ, అన్నాడీఎంకే విమర్శించాయి. డీఎంకే ఈ విమర్శలను కొట్టి పడేసింది.
ఇదీ డీఎంకే ఆలయ ఎజెండా
ఆధ్యాత్మిక పర్యాటక నిధి పేరిట కొంత మొత్తాన్ని ఆలయ సందర్శనకు కేటాయించడం మేనిఫెస్టోలో ప్రధానాంశం. హిందూ దేవాదాయ ధార్మిక విభాగం ఏర్పాటు ద్వారా ఆలయాల సంరక్షణను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి తేవడం మరో అంశం.
కాశీ, కేదార్‌నాధ్, బదరీనాథ్, పురి, గోకర్ణం, తిరుపతి, రామేశ్వరం, మథుర సహా దేశంలోని ఏ ప్రముఖ ఆలయానికి వెళ్లేందుకైనా రూ 25,000 నుంచి లక్ష రూపాయల సాయం
పతనావస్థలో ఉన్న, మరమ్మతులు అవసరమైన కోవెళ్లకు – ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు రూ 1000 కోట్లు కేటాయింపు
తిరుత్తణి, శోలింగార్, తిరునీర్‌మలై, తిరుచ్చి, మలైకొట్టై, తిరుచెంగాడ్ ఆలయాల్లో కేబుల్ కార్ సౌకర్యం
తిరువణ్ణామలై(అరుణాచలం)లో గిరిప్రదక్షిణం చే సే మార్గం వెంబడి హరిత వనం ఏర్పాటు. ఆ 16 కిలోమీటర్ల పరిధిలోని ఆలయాలకు కొత్త సొబగులు
వళ్లలార్ భక్తులకు వడలూర్‌లో కేంద్రం ఏర్పాటు
గ్రామాల్లో ఆలయ పూజారులకు నెలకు రూ 2000. పింఛను కూడా రాష్ట్రవ్యాప్తంగా అర్చకులకు రూ 3000 నుంచి రూ 4000 కు పెంపు
వేదవిద్యను, ఆలయ సంప్రదాయాలను నేర్చుకున్న బ్రాహ్మణేతరులైన 205 మంది ఇతర కులస్థులకు వెంటనే ఆలయాల్లో పూజారిగా నియామకం