హరియాణా ప్రభుత్వాన్ని తొలగించాలి

0
181
Spread the love

సాగు చట్టాలను ఉపసంహరించేదాకా పోరాటం కొనసాగించాలని నిర్ణయించిన రైతు సంఘాలు ప్రభుత్వాలపై దాడి తీవ్రం చేస్తున్నాయి. ‘హరియాణలోని బీజేపీ నేతృత్వ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మారింది. రైతులను దెబ్బతీసే చర్యలు తీసుకొంటోంది. ఈ ప్రభుత్వాన్ని తొలగించి ఎన్‌డీఏకు షాక్‌ ఇవ్వాలి’’ అని కిసాన్‌ మోర్చా నాయకుడు దర్శన్‌ పాల్‌ అన్నారు. శనివారం హరియాణలోని చర్ఖి దాద్రి టోల్‌ ప్లాజా సమీపంలో నిర్వహించిన కిసాన్‌ మహాపంచాయతీలో ఆయనతోపాటు పాల్గొన్న అనేకమంది రైతు నేతలు దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.‘‘ఇది కేవలం రైతు ఉద్యమం కాదు.. ప్రజా ఉద్యమం. ఎన్నటికీ విఫలం కాదు. ప్రభుత్వాలు ప్రజల మాట వినాల్సిందే’’ అని బీకేయూ ప్రధాన కార్యదర్శి రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. ‘చట్టాలను ఉపసంహరించేదాకా, డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించేదాకా తాము తిరిగి ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర విధానం కొనసాగేలా చట్టం తేవాలని, అరెస్ట్‌ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.40లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా నిరసన హోరు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ‘‘ప్రతీ ట్రాక్టర్‌ మీదా ‘ట్రాక్టర్‌ క్రాంతి (విప్లవం) 2021’ అని రాయండి. ఢిల్లీకి 20వేల ట్రాక్టర్ల దాకా వచ్చాయి. దీనిని 40లక్షలకు పెంచడం మా టార్గెట్‌’’ అని ఆయన అన్నారు. పదేళ్ల పైబడ్డ ట్రాక్టర్లను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చెప్పినట్లుగా ఉపసంహరించే ప్రశ్నే లేదన్నారు. అయితే, కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్‌ మాత్రం రైతుల ఆందోళన కేవలం ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమని పునరుద్ఘాటించారు. ‘ఒక రాష్ట్రానికి చెందిన కొన్ని స్వార్థపర శక్తులకు కాంగ్రెస్‌ మద్దతిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తోంది’ అని విమర్శించారు. చర్చలకు ప్రభుత్వం ఎల్లపుడూ సిద్ధంగానే ఉందన్నారు. కాగా, హరియాణకు చెందిన ఓ రైతు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘మోదీ ప్రభుత్వం చట్టాలను కనీసం నా మరణం తరువాతనైనా రద్దు చేస్తుందా..?’ అని కరమ్‌వీర్‌ సింగ్‌ అనే రైతు ఓ లేఖ రాసి- టిక్రీ సరిహద్దుకు 2కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here