దేశంలో 11,610 కరోనా కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1.09 కోట్లు దాటింది. వీటిలో క్రియాశీల(యాక్టివ్) కేసులు ప్రస్తుతం 1.36 లక్షలే ఉండగా, 1.06 కోట్లమంది కోలుకున్నారు. తాజాగా మరో 100 మంది కరోనాతో మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1.56 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో మృతిచెందిన వంద మందిలో సగం మందికిపైగా మహారాష్ట్ర (39), కేరళ (18), తమిళనాడు(7) రాష్ట్రాలవారే.

అయితే ఆంధ్రప్రదేశ్ సహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ కొత్త మరణాలు సంభవించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం నాటికి దాదాపు 91.86 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపింది. కాగా, ముంబై పోలీసులు మాస్క్ ధరించని 15 లక్షల మంది నుంచి రూ.200 చొప్పున రూ.30 కోట్ల జరిమానా వసూలు చేశారు.
దక్షిణాఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్లపై.. మన వ్యాక్సిన్లు ప్రభావం చూపవు
భారత్ ఆమోదించిన రెండు వ్యాక్సిన్లకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్లపై ప్రభావం చూపేటంతటి సామర్ధ్యం ఉందని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకే స్ట్రెయిన్‌పై మాత్రం ఇవి ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఇక.. మంగళవారం దేశంలో తొలిసారిగా ఒక బ్రెజిల్ స్ట్రెయిన్ కేసు, నాలుగు దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే, యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య 187కు చేరుకుందని తెలిపింది. దీనిపై స్పందించిన శాస్త్రవేత్తలు.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్లపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌కు మాత్రమే కొత్త స్ట్రెయిన్లపై అంతో ఇంతో ప్రభావం చూపే సామర్ధ్యం ఉందని తెలిపారు