
కొన్ని సంఘటనలు మనం ఏపనైనా చేసేలా చేస్తాయి. అవసరమైతే మనకు సంబంధం లేని పనులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో ఒక్కోసారి మనం పనిచేస్తున్న రంగంతో సంబంధంలేకపోయినా అనేక అవతారాలు ఎత్తాల్సి వస్తాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇప్పుడు ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయానికొస్తే.. వేలూరు సౌత్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువరాణి శనివారం రాత్రి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ వస్త్ర దుకాణం వద్ద 35 ఏళ్ల యాచకురాలు ప్రసవం నొప్పులతో ఇబ్బంది పడుతోంది. మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన యువరాణి మరో పోలీస్ కానిస్టేబుల్ తో కలిసి ఆమెకు ప్రసవం చేసింది. దీంతో ఆ యాచకురాలు ఆడ శిశువు జన్మించింది. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందజేసి ఆసుపత్రికి తల్లీ, బిడ్డను తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బిడ్డకు జన్మనిచ్చిన ఆమెను విచారించగా.. భర్త వదిలి వెళ్లి పోవడంతో దిక్కులేక భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది. మహిళా పోలీసులు ఆమెకు దుస్తులు, వస్తువులను అందజేశారు. మానవత్వాన్ని చాటుకుని.. ఆపదలో ఉందని తెలుసుకుని మహిళకు ప్రసవం చేసి కానిస్టేబుల్ యవరాణిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నవజాత శిశువును పట్టుకుని ఉన్న పోలీసు ఫోటోను చాలా మంది ట్విట్టర్ లో పోస్టు చేశారు.