ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డబుల్ డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ క్వార్టర్స్ చేరగా.. యూఎస్ ఓపెన్ విజేత డొమినిక్ థీమ్‌కు షాక్ తగిలింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో నెంబర్‌వన్ జొకో 7-6(4), 4-6, 6-1, 6-4తో 14వ సీడ్ రవోనిక్‌పై గెలిచాడు. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్‌ల్లో అత్యధికంగా 300 మ్యాచ్‌లు నెగ్గిన ఫెడరర్ సరసన నిలిచాడు. మూడో సీడ్ థీమ్ 4-6, 4-6, 0-6తో దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో చిత్తయ్యాడు. జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-4, 7-6(5), 6-3తో డుసన్ లజోవిచ్ (సెర్బియా)పై, అస్లన్ కరత్సేవ్ (రష్యా) 3-6, 1-6, 6-3, 6-3, 6-4తో ఫెలిక్స్ అగర్ అలియాస్మి (కెనడా)పై నెగ్గారు.

ఓటమి గండం నుంచి..: మహిళల సింగిల్స్‌లో స్టార్లంతా ప్రీక్వార్టర్స్‌లో చెమటోడ్చారు. ఒసాక 4-6, 6-4, 7-5తో 14వ సీడ్ ముగురుజాపై, సెరెనా విలియమ్స్ 6-4, 2-6, 6-4తో సబలెంకపై, రెండో సీడ్ హలెప్ 3-6, 6-1, 6-4తో స్వియాటెక్‌పై అతికష్టమ్మీద గెలిచి క్వార్టర్స్‌లో ప్రవేశించారు. మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అన్ సీడెడ్ హి సు వి 6-4, 6-2తో మార్కెటా వాండ్రొసొవాను ఓడించింది.